
మెట్ల నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
రోజూకనీసం 50 అడుగులతో ఎంతో మేలు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమతో కూడిన పనులో, వ్యాయామమో చేయాలి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది విస్మరిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో కారణాలు. మరి దీనికి పరిష్కారం? సింపుల్... వ్యాయామం చేయడం వీలు కాకపోతే, మెట్లు ఎక్కి, దిగండి! సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఇది ఒకటని అధ్యయనాలుచెబుతున్నాయి.
క్రమంతప్పకుండా రోజుకు మూడు అంతస్తులు.. అలా ఆడుతూ పాడుతూ ఎక్కి దిగేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! దీంతో శారీరక స్థిరత్వం పెరుగుతుంది. హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. యూఎస్‌లోని టూలేన్ విశ్వవిద్యాలయం 2023లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ కనీసం 50 అడుగులు మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. ‘కండరాలకు ఆక్సిజన్ ను అందించే సామర్థ్యం పెరుగుతుంది. చెడుకొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని ఈ అధ్యయనం వివరించింది.
నడకను మించిన కేలరీలు
మెట్లు ఎక్కి, దిగడం వల్ల జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పటికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు మెట్లుఎక్కడం వల్ల దాదాపు 223 కేలరీలు బర్న్ అవుతాయి.
కాళ్లు పటిష్టంగా..
కాళ్ళు బలంగా మారతాయి. ప్రతి అడుగులో కాళ్ళుగురుత్వాకర్షణకు వ్యతిరేకంగాశరీరాన్ని ఎత్తుతాయి. దీంతో కాళ్ళు, పిరుదులు, ఉదరకండరాలపై ప్రభావం పడుతుంది. వాటి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యం..
వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంచుతుంది. ఏ రకమైన వ్యాయామం అయినా ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎముకల ఆరోగ్యం:
మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికిఅద్భుతమైనవి. ఎముక బలంగా పెరుగుతుంది. బోలు ఎముకలవ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఇప్పటికే కాళ్ల సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వైద్యులనుసంప్రదించి తగు వ్యాయామాలు చేయాలి.
ఆ ప్రమాదం తక్కువ..
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవలిసమావేశంలో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. మెట్లు ఎక్కని వారితో పోలిస్తే మెట్లు ఎక్కేవారు గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 39% తక్కువగా ఉంది. వారిలో గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం కూడా తక్కువగా ఉందట.
సులభ వ్యాయామం
జిమ్ వంటి దినచర్యల మాదిరిగా కాకుండా మెట్ల నడకకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఖర్చూ ఉండదు. తీరిక లేనివారికి ఇది సులభమైన వ్యాయామం.
రక్తంలో చక్కెర నియంత్రణ..
చిన్న మొత్తంలో చేసే శారీరక శ్రమ సైతం ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కడం.. సమతల నేలపై నడవడంతో పోలిస్తే రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎన్ని మెట్లు ఎక్కాలి?
రోజుకు 3 అంతస్తులు ఎక్కి, దిగడం ద్వారా రోజువారీ దినచర్యలకు సరిపోయే స్థిరమైన ఫిట్‌నెస్ అందుకోవచ్చు. వ్యక్తుల ఫిట్‌నెస్ స్థాయినిబట్టి మెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.
» బిగినర్ అయితే 1–2 అంతస్తులు.. అంటే 20–40 మెట్లతో ప్రారంభించండి. ∙సీనియర్ అయితే ఫిట్‌నెస్‌ను బట్టి 5–10 అంతస్తులు లక్ష్యంగా పెట్టుకోవచ్చు.
వైద్యుల సలహాతోనే..
మెట్లు ఎక్కడం చాలా మందికి సురక్షితం. కానీ ఈ కింది జాబితాలో ఉన్నవారు, ఇవి కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో వ్యాయామం చేయాలి.
1. ఊబకాయం
2. కీళ్ల వ్యాధి
3. తూలిపడే సమస్య ఉన్నవారు
4. వృద్ధులు, బలహీనమైన వ్యక్తులు
5. గుండె, ఊపిరితిత్తుల వ్యాధి6. ఇటీవలి కాలంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు.