
సెన్సార్‌షిప్‌పై ఆందోళనలు
సర్వత్రా నిరసన
అక్షరంపై అంక్షలు... పుస్తకాలపై నిషేధం అంటే.. చరిత్రను సమాధి చేయడం. ప్రజల జ్ఞాపకాలను కప్పేట్టేయాలని ప్రయతి్నంచడం. అధికారాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో జరిగిందదే. 25 పుస్తకాలపై రాష్ట్రంలోని కేంద్రపాలిత ప్రభుత్వం నిషేధం విధించింది.
బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, ప్రముఖ రచయితలు ఏజీ నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్, సుమంత్ర బోస్, డేవిడ్ దేవదాస్, అనురాధ భాసిన్, అయేషా జలాల్‌తోపాటు పలువురి పుస్తకాలపై నిషేధాన్ని ప్రకటించింది.
తప్పుడు కథనాలు, వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనే కారణంతో ఆయా పుస్తకాలను నిషేధిస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. ‘విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఆధారంగా హింస, ఉగ్రవాదంలో యువత పాల్గొనేలా తప్పుడు కథనాలు, వేర్పాటువాద సాహిత్యం ఉసిగొల్పుతున్నాయి. ఇవి ఉగ్రవాదాన్ని కీర్తించి భారత్‌పై హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వీటివల్లే యువత తప్పుదారి పడుతోందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన తరువాతే ఈ పుస్తకాలను నిషేధిస్తున్నాం’అని జమ్మూ కశ్మీర్ హోం శాఖ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులో పుస్తకాలు ఏ విధంగా హింసను కీర్తించాయో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేవలం విశేషణాలను మాత్రమే ఉపయోగించింది.
హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా 48 గంటల్లో, జమ్మూ కశ్మీర్ పోలీసులు పుస్తకాల దుకాణాల్లో సోదాలు నిర్వహించి పుస్తకాలను జప్తు చేశారు. వేసవి రాజధాని శ్రీనగర్‌తో పాటు, మధ్య కశ్మీర్‌లోని గండర్‌బాల్, ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాల్లోని పుస్తక దుకాణాల్లో దాడులు చేశారు. శ్రీనగర్‌లో చినార్ పుస్తక ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ నిషేధం విధించడం గమనార్హం. ఈ నిషేధం ప్రజల్లో సెన్సార్షిప్ భయాలను పెంచుతోంది.
నిషేధిత జాబితాలో ఉన్న
ప్రముఖ పుస్తకాలు..
ప్రభుత్వ నిషేధ జాబితాలో బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ రాసిన ‘ఆజాదీ’, రాజ్యాంగ నిపుణుడైన ఏజీ నూరానీ రాసిన ‘ది కశ్మీర్ డిస్ప్యూట్: 1947–2012’, బ్రిటిష్ రచయిత్రి, చిత్రకారిణి విక్టోరియా స్కోఫీల్డ్ రాసిన ‘కశ్మీర్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ – ఇండియా, పాకిస్తాన్ అండ్ ది అన్‌ఎండింగ్ వార్’, జర్నలిస్ట్, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భాసిన్ రాసిన ‘ది డిస్మాంటిల్డ్ స్టేట్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370’, ‘కంటెస్టెడ్ ల్యాండ్స్’, డేవిడ్ దేవదాస్ రాసిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ – ది స్టోరీ ఆఫ్ కశ్మీర్’, తారిక్ అలీ, హిలాల్ భట్, హబ్బా ఖాతున్, పంకజ్ మిశ్రా, అరుంధతీ రాయ్‌లతో కలిసి ఆంత్రోపాలజిస్ట్ అంగనా ఛటర్జీ రాసిన ‘కాశ్మీర్: ఎ కేస్ ఫర్ ఫ్రీడమ్’, మొహమ్మద్ యూసఫ్ సరాఫ్ రాసిన ‘కశ్మీరీస్ ఫైట్ ఫర్ ఫ్రీడం’, అబ్దుల్ గోక్‌హౌమి జబ్బార్ రాసిన ‘కశ్మీర్ పాలిటిక్స్ అండ్ ప్లెబిసైట్’, ఎస్సార్ బటూల్ రాసిన ‘డు యూ రిమెంబర్ కునాన్ పోషో్పరా?’, రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారుడు సుమంత్ర బోస్ రాసిన ‘కశ్మీర్ ఎట్ ది క్రాస్‌రోడ్స్’, హఫ్సా కంజ్వాల్ రాసిన ‘కాలనైజింగ్ కశ్మీర్: స్టేట్–బిల్డింగ్ అండర్ ఇండియన్ ఆక్యుపేషన్’, మరో ఇద్దరు విదేశీ రచయితలు కలిసి రచించిన ‘హ్యూమన్ రైట్స్ వయొలేషన్స్ ఇన్ కశ్మీర్’తో పాటు పలు పుస్తకాలు ఉన్నాయి.
పుస్తకాల్లో ఏముంది?
అరుంధతీ రాయస్ రాసిన ఆజాదీ.. 2018 నుంచి 2020 మధ్య కాలంలో ఆమె రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాల సంకలనం. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి కాలమని, మెజారిటీవాదం, మతోన్మాదం పెరుగుదల దేశానికి అత్యంత ప్రమాదకరమని చెబుతుంది. దేశం ఎలా స్వేచ్ఛను కోల్పోయిందో వివరిస్తుంది. ఏజీ నూరానీ ది కశ్మీర్ డిస్ప్యూట్.. దీర్ఘకాల కశ్మీర్ సమస్య సంక్లిష్ట చరిత్రను, దాని చుట్టూ ఉన్న రాజకీయ అసంతృప్తి, అసమ్మతిని వివరిస్తుంది.
ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలితంగా మార్చడంపై ప్రశ్నలను సంధిస్తుంది. అనురాధా భసిన్ రాసిన పుస్తకం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల జీవితాలు, స్థానిక రాజకీయాలు, సామాజిక రంగాలపై ఆ చర్యల ప్రభావం గురించి చర్చిస్తుంది. మొత్తంగా పుస్తకాలన్ని.. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మారణహోమాలు, ఈ ప్రాంతపు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తాయి.
విమర్శల వెల్లువ...
పుస్తకాల నిషేధంపై జమ్మూకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిషేధాన్ని ప్రజల జ్ఞాపకాలపై దాడిగా పౌర హక్కుల ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, రచయితలు అభివరి్ణస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వంపై అసమ్మతిని అణచివేయడానికి సెన్సార్‌షిప్ ఒక ఉదాహరణని, ఇది దేశమంతటా ఉండగా.. 2019 తరువాత జమ్మూ కశ్మీర్‌లో అత్యంత దారుణంగా మారిందని పేర్కొన్నారు. నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంటర్ గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నారు. ‘ఈ నిషేధం ఇప్పుడు కశ్మీర్‌లో జరుగుతోంది. రేపు మరోచోట జరగొచ్చు. అధికారం రాతలను అణచివేయొచ్చు. కానీ కశ్మీర్ చరిత్ర పుస్తకాలలో మాత్రమే లేదు. అది మౌఖిక సంప్రదాయంలో ఉంది. ప్రజల జ్ఞాపకాలలో ఉంది. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు. అవి ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తాయి’అని రచయితలు చెబుతున్నారు.
ప్రమాదకర ధోరణి : అనురాధ భాసిన్
‘మొదట వారు జర్నలిస్టుల కోసం వచ్చారు, మా గొంతులు నొక్కేయడంలో విజయం సాధించామని గ్రహించి, ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సారించారు’అని ప్రముఖ ఎడిటర్ అనురాధ భాసిన్ విమర్శించారు. తన పుస్తకం హింసను ప్రోత్సహిస్తుందనే ఆరోపణలను భాసిన్ ఖండించారు. ‘నా పుస్తకం ఎక్కడా ఉగ్రవాదాన్ని కీర్తించలేదు. ప్రభుత్వాలను విమర్శించింది. ఈ రెండింటికీ తేడా ఉందనే విషయాన్ని అధికారులు గమనించడం లేదు.
ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదు. అది విభజనను మాత్రమే పెంచుతుంది. కశ్మీర్‌లో, ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడం, ప్రాథమిక హక్కులను అణచివేయడం అపనమ్మకాన్ని, పరాయి పాలనలో ఉన్నామనే భావనను పెంచుతుంది’అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నియంత్రణకు సుదీర్ఘ చరిత్ర...
సెన్సార్‌షిప్ చరిత్ర ప్రపంచానికి కొత్త కాదు. కశ్మీర్‌కు అసలే కాదు. పుస్తకాలను నిషేధించడం ద్వారా ఆలోచనను అణచివేయాలనుకోవడం చాలా పాత వ్యూహమే. మానవ చరిత్ర అంతటా ఇది ఉంది. 1910లో, బ్రిటిష్ వారు మహాత్మా గాంధీ రాసిన హింద్ స్వరాజ్ పుస్తకం గుజరాతీ ఎడిషన్‌ను నిషేధించారు. దీనిని రాజద్రోహంగా అభివరి్ణంచారు. 1933లో మే నాజీ విద్యార్థులు జర్మన్ కానివిగా భావించిన వేలాది పుస్తకాలను తగలబెట్టారు. 1904లో, మున్షీ ముహమ్మద్ దిన్ ఫౌక్ శ్రీనగర్ నుంచి ఒక వార్తాపత్రికను ప్రచురించడానికి అప్పటి డోగ్రా పాలకుడు మహారాజా ప్రతాప్ సింగ్ అనుమతి కోరారు.
ఫౌక్ అనుమతి నిరాకరించడమే కాకుండా, భవిష్యత్తులో అలాంటి అభ్యర్థనలను స్వీకరించకుండా నియమాలను రూపొందించాలని ఆయన తన ప్రధానమంత్రిని ఆదేశించారు. 2010లో 17 ఏళ్ల విద్యార్థి తుఫైల్ మట్టూ హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ప్రభుత్వం ఎస్‌ఎమ్‌ఎస్ సేవలను నిషేధించింది. మూడేళ్ల తరువాత పునరుద్ధరించింది. 2016లో తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని ఇండిపెండెంట్ పత్రిక అయిన ‘కశ్మీర్ రీడర్’ను ప్రభుత్వం నిషేధించింది. హింసను ప్రేరేపించే ధోరణిలో ఉందంటూ నిలిపేసింది. కశ్మీర్‌లో నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొన్నవారు జర్నలిస్టులే. ఆ నమూనా 2019 నుంచి మరింత పెరిగింది.
– సాక్షి, నేషనల్ డెస్క్