హైదరాబాద్ మెట్రో నిర్వహణకు ‘జైపూర్ మోడల్’!
సీఎం రేవంత్‌రెడ్డికి సూచించిన కేంద్రం
కేంద్ర మంత్రి ఖట్టర్‌తో రేవంత్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి భేటీ
మెట్రో ఫేజ్–1 వాల్యూయేషన్‌కు ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యత
రుణసంస్థ ఎంపిక, ఫేజ్–2 విస్తరణ,ఇతర అంశాలపై అధ్యయనం
ఈ ప్రక్రియ వేగవంతానికి కేంద్ర,రాష్ట్ర అధికారులతో సమన్వయ కమిటీ
కేంద్రంతో చర్చలు ఫలప్రదం: రేవంత్
రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్నా: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థ పురోభివృద్ధిలో సంయుక్తంగా సాగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నిర్వహణ, అభివృద్ధి కోసం‘జైపూర్ మోడల్’ను కేంద్ర మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి ముందుపెట్టినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సూచనకు సీఎం రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఢిల్లీలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ మంగళవారం ఉదయం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఆయన నివాసంలో కలిశారు.
మెట్రో ఫేజ్–1 వాల్యూయేషన్, ఫేజ్–1 స్వాధీనానికి అవసరమైన రుణసేకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్–2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధ్యయనం చేయడానికి ఎస్‌బీఐ క్యాప్స్ (ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్)ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. అధ్యయనంలో సమన్వయానికి కృషి చేసేలా జాయింట్ కమిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ప్రతినిధులుగా ఉంచాలని నిర్ణయించారు.
ఎస్‌బీఐ క్యాప్స్ సమర్పించే నివేదిక ఆధారంగా మెట్రోపై తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయంటూ రేవంత్‌రెడ్డి ఈ భేటీ అనంతరం ఒక ప్రకటనలో వెల్లడించారు. కిషన్‌రెడ్డి కూడా ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
ఐఆర్‌ఎఫ్‌సీ రుణం లేనట్లే...
హైదరాబాద్ మెట్రో ఫేజ్–1లో ఈక్విటీ షేర్ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15వేల కోట్ల మేర ఫైనాన్సింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. ఒప్పందం ప్రకారం ఈనెల 15న మొదటి విడత రుణం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అది కుదరలేదు.
దీనిపై రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. చివరకు ఇద్దరూ కలిసి కేంద్ర మంత్రులతో జరిపిన తాజా చర్చల్లో మెట్రో ఫేజ్–1 వాల్యూయేషన్ చేయాలని నిర్ణయించారు. ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక ప్రకారం రుణ సంస్థను ఎంపిక చేస్తారు. అది ఐఆర్‌ఎఫ్‌సీ అవుతుందా, లేదా మరో సంస్థ నుంచి రుణం తీసుకోవాలా అనేది భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కీలక దిశగా అడుగులు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో 2017లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్–1ను గత ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. అప్పటివరకూ దీన్ని నిర్మించి, నిర్వహించిన ఎల్ అండ్ టీ కోవిడ్ తర్వాత వచ్చిన నష్టాల కారణంగా వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జైపూర్ మోడల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఫేజ్–2 నిర్మాణం, నిర్వహణ చేపడితే కీలక పరిణామమే అవుతుంది.
ఏమిటీ జైపూర్ మోడల్?
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో మెట్రో రైల్వే వ్యవస్థ 2015 జూన్ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది కూడా ఫేజ్–2 విస్తరణ దశలో ఉంది. ప్రారంభంలో జైపూర్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పటికీ, తర్వాత కేంద్ర మెట్రో రైలు పాలసీ ప్రకారం ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా రూపాంతరం చెందింది. ఇటీవల ఆమోదించిన ఫేజ్–2 విస్తరణ పనులను ‘రాజస్తాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ అనే సంస్థ ద్వారా 50ః50 సంయుక్త భాగస్వామ్యంతో రెండు ప్రభుత్వాలు కలిసి చేపడుతున్నాయి.


