ప్రైవేట్, స్టార్టప్ కంపనీలకు ఊతం మన బాధ్యతని వెల్లడి
ప్రస్తుతం 450 ప్రైవేట్ కంపెనీలతో పనిచేస్తున్నాం
ఛైర్మన్ వి.నారాయణన్ స్పష్టీకరణ
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రభుత్వ సంస్థగానే కొనసాగనుందని ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ఆందోళనలను కొట్టివేశారు. భారత అంతరిక్ష ప్రయోగ వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ఇస్రో ప్రస్తుతం 450 స్టార్టప్, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేశారు. తయారీ, నిర్వహణ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదనపై ఇస్రో అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరుతూ తొమ్మిది ఉద్యోగ సంఘాలు సెపె్టంబరు నాలుగున ఛైర్మన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
బెంగళూరులో సోమవారం మొదలైన తొమ్మిదవ బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో కార్యక్రమంలో ఛైర్మన్ నారాయణన్ విలేకరులతో మాట్లాడారు. భారత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాలు మొదలై దాదాపు 65 సంవత్సరాలవుతోందని, దేశంలోని సామాన్య పౌరుల సేవలో 56 వ్యవస్థలు అంతరిక్షంలో పనిచేస్తున్నాయని... కాకపోతే మరెన్నో వ్యవస్థల అవసరం ఉందని చెప్పారు. ఆరేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో సంస్కరణల అమలు మొదలైనప్పుడు ఇస్రో ప్రైవేట్ రంగాన్ని, స్టార్టప్ కంపెనీలకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఏర్పడిందని గుర్తు చేశారు.


