ఢిల్లీ: వచ్చే నెల(జులై)లో జరగనున్న అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఇవాళ (మంగళవారం) న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ అధికారిక ఆహ్వానాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు (MEA) పంపింది.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మషాద్‌లో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. జులై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. 4వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమై.. జూలై 9న ఖమేనీ స్వగ్రామమైన మషాద్‌లో ఆయన ఖననంతో ముగుస్తాయి.
అధ్యక్షుడు పెజెష్కియాన్ తరపున అధికారిక ఆహ్వానాలు అందుకున్న ప్రపంచ నాయకులలో పీఎం మోదీతో పాటు చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్ , పాకిస్తాన్ దేశాల నేతలు ఉన్నారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందం ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతుందని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.
న్యూఢిల్లీలోని వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్.. మార్చి 5న ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అధికారిక సంతాప పుస్తకంలో సంతకం చేశారు.
ప్రధాని మోదీ చివరిసారిగా మే 2016లో ఇరాన్‌లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేశారు. ఆ సమయంలో చాబహార్ రేవు అభివృద్ధికి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన ఖమేనీ, అప్పటి అధ్యక్షుడు హసన్ రౌహానీలతో సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత, ఫిబ్రవరి 2018లో పీఎం మోదీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు రౌహానీ భారత్‌లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లను సందర్శించారు. మోదీ, పెజెష్కియాన్ చివరిసారిగా అక్టోబర్ 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో పీఎం మోదీ, పెజెష్కియాన్‌ను భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.


