కోల్‌కతా: మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఎంసీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. అయితే, ఈ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉంటే టీఎంసీ ఇన్ని స్థానాల్లో గెలిచేవారు కాదని బార్ కౌన్సిల్‌లో బీజేపీ మద్దతు దారులు వ్యాఖ్యానిస్తున్నారు.
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23 స్థానాల్లో 15 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మహిళల కోసం రిజర్వ్ చేసిన ఐదు స్థానాల్లో టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. గెలిచిన తృణమూల్ అభ్యర్థులను మమతా బెనర్జీ సిఫార్స్‌ల మేరకే పోటీ జరిగినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా అభ్యర్థుల నుండి అదనంగా ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయనుంది. ఈ నామినేషన్లతో, పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 25కు పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీఎంసీ 23 మంది అభ్యర్థులను, బీజేపీ 22 మందిని, లెఫ్ట్ ఫ్రంట్ 12 మందిని, 18 మంది స్వతంత్రులను బరిలోకి దింపాయి. ఫలితాల్లో బీజేపీ తన మునుపటి మూడు సీట్ల స్థానాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ తన రెండు సీట్లను నిలుపుకుంది. అయితే, లెఫ్ట్ ఫ్రంట్ ప్రాతినిధ్యం గత ఎన్నికల్లోని నాలుగు సీట్ల నుండి ఈసారి మూడు సీట్లకు పడిపోయింది.
బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత టీఎంసీ న్యాయవాదుల విభాగం సభ్యుడు సంజయ్ బర్ధన్ మాట్లాడారు. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొనడంతో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వేసిన ఓట్ల ద్వారా గత మార్చిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం, 23 సీట్లలో ఐదు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మహిళా సీట్లలో నాలుగు సీట్లను తృణమూల్ దక్కించుకుంది అని బర్ధన్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మార్చి 9న పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఫలితాలు వెలువడటంతో టీఎంసీ త్వరలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ న్యాయవాద వర్గంలోని కొన్ని వర్గాలలో పార్టీ సంస్థాగత ప్రభావం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితం ఒక సంకేతంగా పార్టీలో భావిస్తున్నారు.
2011 నుండి వరుసగా మూడు సార్లు ఘనవిజయాలు సాధించి, 15 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 80 స్థానాలకే పరిమితమై ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అంతర్గత తిరుగుబాటు మొదలైంది.
పార్టీలోని మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని కాదని తిరుగుబాటు పక్షాన నిలిచారు. అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంటులో కూడా మమతకు గట్టి షాక్ తగిలింది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది ఎంపీలు పార్టీకి దూరమై, కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రాభవం ఇంకా ఉందని బార్ కౌన్సిల్ ఎన్నికలు నిరూపించాయి.


