breaking news
Left parites
-
పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దీదీ క్లీన్ స్వీప్.. బీజేపీకి షాక్!
కోల్‌కతా: మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఎంసీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. అయితే, ఈ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉంటే టీఎంసీ ఇన్ని స్థానాల్లో గెలిచేవారు కాదని బార్ కౌన్సిల్లో బీజేపీ మద్దతు దారులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23 స్థానాల్లో 15 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మహిళల కోసం రిజర్వ్ చేసిన ఐదు స్థానాల్లో టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. గెలిచిన తృణమూల్ అభ్యర్థులను మమతా బెనర్జీ సిఫార్స్‌ల మేరకే పోటీ జరిగినట్లు సమాచారం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా అభ్యర్థుల నుండి అదనంగా ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయనుంది. ఈ నామినేషన్లతో, పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 25కు పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీఎంసీ 23 మంది అభ్యర్థులను, బీజేపీ 22 మందిని, లెఫ్ట్ ఫ్రంట్ 12 మందిని, 18 మంది స్వతంత్రులను బరిలోకి దింపాయి. ఫలితాల్లో బీజేపీ తన మునుపటి మూడు సీట్ల స్థానాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ తన రెండు సీట్లను నిలుపుకుంది. అయితే, లెఫ్ట్ ఫ్రంట్ ప్రాతినిధ్యం గత ఎన్నికల్లోని నాలుగు సీట్ల నుండి ఈసారి మూడు సీట్లకు పడిపోయింది. బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత టీఎంసీ న్యాయవాదుల విభాగం సభ్యుడు సంజయ్ బర్ధన్ మాట్లాడారు. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొనడంతో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వేసిన ఓట్ల ద్వారా గత మార్చిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం, 23 సీట్లలో ఐదు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మహిళా సీట్లలో నాలుగు సీట్లను తృణమూల్ దక్కించుకుంది అని బర్ధన్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మార్చి 9న పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఫలితాలు వెలువడటంతో టీఎంసీ త్వరలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ న్యాయవాద వర్గంలోని కొన్ని వర్గాలలో పార్టీ సంస్థాగత ప్రభావం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితం ఒక సంకేతంగా పార్టీలో భావిస్తున్నారు.2011 నుండి వరుసగా మూడు సార్లు ఘనవిజయాలు సాధించి, 15 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 80 స్థానాలకే పరిమితమై ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అంతర్గత తిరుగుబాటు మొదలైంది.పార్టీలోని మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని కాదని తిరుగుబాటు పక్షాన నిలిచారు. అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంటులో కూడా మమతకు గట్టి షాక్ తగిలింది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది ఎంపీలు పార్టీకి దూరమై, కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రాభవం ఇంకా ఉందని బార్ కౌన్సిల్ ఎన్నికలు నిరూపించాయి. -
అధికార పార్టీ మాటలు అసలు నమ్మొద్దు కామ్రేడ్!
అధికార పార్టీ మాటలు అసలు నమ్మొద్దు కామ్రేడ్! -
బాబు, పవన్‌లపై లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి?
ఏపీలో వామపక్షాలకు జ్ఞానోదయం కలిగిందా? చంద్రబాబు అండ్ పవన్‌కల్యాణ్‌ల ఊసరవెల్లి రాజకీయాలు వారికి నిజంగానే అర్థమయ్యాయా? బాబు, పవన్‌ల మీద ఏపీ లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో కలిసే ఛాన్స్ పోతుందని ఆందోళన చెందుతున్నాయా? నిజంగా ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాయా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ అక్కడి రాజకీయాలు ఎప్పటి నుంచో మాంచి కాకమీదున్నాయి. రేపే సీఎం సీటు మీద కూర్చోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉవ్విళ్ళూరిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వబోనని ప్రతిజ్ఞలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీతో బీజేపీని కలపాలని తెగ ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు, బీజేపీ నుంచి బీఎస్పీ వరకు చంద్రబాబు పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ భారత దేశంలో లేదు. జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్ళు గడచినా ఇంకా నిర్మాణమే చేయని పవన్ కల్యాణ్ కూడా బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ..ఇలా అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దత్త పుత్రుడుగా ముద్ర వేయించుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే ఇతర పార్టీలు గౌరవించేవి. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు రాజకీయాలు మొదలుపెట్టాయో అప్పటినుంచే ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల గౌరవం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సీపీఎం, సీపీఐలు ఈసారి టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని...ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాయి. కాని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమకు ఎక్కడ దూరం అవుతాడో అని లెఫ్ట్ పార్టీలకు బెంగ పట్టుకుంది. అసెంబ్లీలో కాలు మోపే ఛాన్స్ ఈసారి కూడా మిస్ అవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. తాజాగా సీపీఎం, సీపీఐ తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు బీవీ రాఘవులు, కంకణాల నారాయణ సంయుక్తంగా చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ మెడ పట్టి గెంటుతున్నా..చూరు పట్టుకుని వేళ్ళాడటానికి ఇద్దరికీ సిగ్గు లేదా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశంతో..మరోసారి కాంగ్రెస్‌తో... ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడే వామపక్షాలు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాయి. సొంతంగా పోటీ చేసినపుడు భంగపడ్డాయి. గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి బోల్తా పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో జతకట్టాలని ఉబలాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ చేస్తున్న బ్రోకరిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని పోజులు కొడుతున్నా.. వాస్తవానికి అసెంబ్లీలో ఒకటో.. రెండో సీట్లు గెలవాలంటే చంద్రబాబు పంచన చేరక తప్పదని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ టీడీపీ తోక పార్టీలుగా వ్యవహరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతిదానికీ విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని పదే పదే చెబుతున్నారు. అందుకే సింహాన్ని ఎదిరించేందుకు గుంపుతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ప్రజలకు దూరమైన కమ్యూనిస్టు పార్టీలు ఇలాగే చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న వాటి కోరిక ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
టీడీపీ ఓటమే లక్ష్యం
బీజేపీతో పొత్తుకట్టిన బాబుపై వామపక్షాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: పాత మిత్రపక్షం టీడీపీపై వామపక్షాలు మండిపడుతున్నా యి. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో పొత్తు కుదుర్చుకుని చంద్రబాబు లౌకికతత్వానికి తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. వామపక్షాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించిన సీపీఐ, సీపీఎం నేతలు టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చాయి. బీజేపీ వత్తాసుతో చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నాయి. అభివృద్ధికి తాను, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నమూనాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా పరిగణించాయి. గోద్రా మారణకాండను వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించడంతోపాటు.. ఆ సందర్భంగా మోడీని ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికే అనుమతించనన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. అవినీతిమయమైన యూపీఏపై ఉన్న ప్రజాగ్రహాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు బాబు వత్తాసు పలికితే ఘోరంగా దెబ్బతినక తప్పదని హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర విభజన సందర్భంగా బీజేపీ, చంద్రబాబు అనుసరించిన వైఖర్ని దునుమాడనున్నాయి. విభజనను బీజేపీ, టీడీపీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, ఒక పార్టీ బాహాటంగానే మద్దతు పలికితే టీడీపీ పరోక్షంగా సహకరించిందన్న అభిప్రాయం సీమాంధ్రలో ఉందని, దాన్నే విస్తృతంగా ప్రచారం చేస్తామని కమ్యూనిస్టు పార్టీలు పేర్కొంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు ఓటేయాలని కోరుతూ.. మతతత్వవాదులను, వారికి సహకరిస్తున్న చంద్రబాబు వంటి వారిని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.


