ఇరాన్‌లో సర్వత్రా యుద్ధ వాతావరణం
ఎక్కడ చూసినా అశాంతి, అలజడే
ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపేశారు
భయానక అనుభవాలు పంచుకున్న భారతీయులు
ఇరాన్ నుంచి స్వదేశానికి రాక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉది్వగ్న పరిస్థితులు కనిపించాయి. ఇరాన్ నుంచి క్షేమంగా తిరిగివచ్చిన తమ కన్నబిడ్డలను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలతో స్వాగతం పలికారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల కోసం పెద్ద సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టుకు తరలిచ్చారు.
ఇరాన్‌లో కొన్ని రోజులుగా ప్రజల ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండడం, శాంతి భద్రతలు దిగజారుతుండడంతో అక్కడున్న భారతీయులు కమర్షియల్ విమానాల్లో శుక్రవారం అర్ధరాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుంచి తిరిగిరావాలని భారత ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారు లు, పవిత్ర క్షేత్రాల దర్శనానికి వెళ్లిన భక్తులు ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారు స్వదేశానికి తిరిగిరావడానికి భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహకరించాయి. అతిత్వరలో మరికొందరు భారతీయులు ఇరాన్ నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం.
వ్యవస్థలు స్తంభించిపోయాయి
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత పలువురు తమ భయానక అనుభవాలను వ్యక్తంచేశారు. ఇరాన్‌లో అక్షరాలా యుద్ధ వాతావరణమే నెలకొందని వెల్లడించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిక్షణం భయంభయంగా బతికామని అన్నారు. అక్కడ పరిస్థితులు నానాటికీ భీకరంగా మారుతున్నాయని, బయటకు వెళితే ప్రాణాలతో తిరగి వస్తామన్న గ్యారంటీ లేదని తెలిపారు. వ్యవస్థలన్నీ దాదాపు స్తంభించిపోయాయని, ఇంటర్నెట్ సేవలను ఆపేశారని, ఫోన్లలో మాట్లాడుకొనే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అక్కడ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తోందని వివరించారు.
నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది
‘‘నెల రోజుల క్రితం ఇరాన్ వెళ్లాం. కానీ, రెండు వారాల క్రితమే సమస్యలు మొదలయ్యాయి. బయటకు వెళితే నిరసనకారులు అడ్డుకొనేవారు. మా వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చేవారుకాదు. చేసేది లేక మా నివాసానికి తిరిగి వచ్చేవాళ్లం. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఎక్కడేం జరుగుతోందో తెలిసేది కాదు. మా క్షేమ సమాచారాలను ఇండియాలోని కుటుంబ సభ్యులకు చేరవేసే అవకాశం కూడా దక్కలేదు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది. అది నిజంగా చాలా కష్టమైన సమయం. మొత్తానికి భారత ఎంబసీ సహకారంతో బయటపడ్డాం’’అని ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు.
సొంత ఖర్చుతోనే వచ్చా..
‘‘నేను ఇరాన్‌లో షిరాజ్ నగరంలో ఉన్న మెడికల్ కాలేజీలో చదుకుంటున్నా. కానీ, ఇంటర్నెట్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అసలేం జరుగుతోందో తెలిసేదికాదు. భారత ప్రభుత్వ సూచనతో స్వదేశానికి తిరిగివచ్చా. నేను సొంత ఖర్చుతోనే వచ్చా. ప్రభుత్వం మాకోసం ప్రయాణ ఏర్పాట్లు చేయలేదు’’అని ఓ వైద్య విద్యారి్థని తెలియజేశారు.
9 వేల మంది భారతీయులు
ఇరాన్ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇరాన్‌లో ప్రస్తుతం దాదాపు 9 వేల మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ చెప్పారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎవరూ ఇరాన్‌కు వెళ్లే ప్రయత్నం చేయొద్దని కోరారు.


