
దీపావళి, ఛత్ సెలవుల్లో రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు
రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై 20% రాయితీ
ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం
అక్టోబర్ 13 నుంచి చేసే ప్రయాణాలకు ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్’
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి, ఛత్ పండుగల రద్దీని తగ్గిస్తూ ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్’పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై 20 శాతం రాయితీ లభిస్తుంది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా చేసే బుకింగ్‌లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన రౌండ్ ట్రిప్ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లే ప్రయాణం అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, వచ్చే ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి.
రిటర్న్ టికెట్ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు. రెండు ప్రయాణాలూ ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు. అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్‌ఫర్మ్‌డ్ టికెట్లు తప్పనిసరి. ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని సాధారణ, ప్రత్యేక రైళ్లకు రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ పథకం కింద బుక్ చేసిన టికెట్లకు రీఫండ్ లేదా మార్పులు అనుమతించరు. ఆన్‌లైన్ లేదా కౌంటర్.. రెండు టికెట్లు ఒకే విధానంలోనే బుక్ చేయాలి. ఈ స్కీమ్ పండుగ సీజన్‌లో రద్దీని విభజించడంతో పాటు, ప్రత్యేక రైళ్ల వినియోగాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వేశాఖ ఆశిస్తోంది.
ఆఫర్ వివరాలు
→ బుకింగ్ ప్రారంభం: ఆగస్టు 14, 2025
→ ప్రారంభ ప్రయాణం: అక్టోబర్ 13 నుంచి 26 వరకు
→ తిరుగు ప్రయాణం: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు
→ రిటర్న్ టికెట్ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు.
→ రానుపోను టికెట్లు ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థాన జంటకు మాత్రమే.
→ రెండు ప్రయాణాలకూ కన్‌ఫర్మ్‌డ్ టికెట్లు తప్పనిసరి.
→ ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా అన్ని రైళ్లకు ఆఫర్ వర్తింపు.
→ టికెట్ బుక్ చేసిన తర్వాత మార్పులు, రీఫండ్‌లు ఉండవు.