ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం పై దర్యాప్తు
తగులబడిన బోగీలు విజయవాడ తరలింపు
నేడు, రేపు విజయవాడ ఈటీటీసీలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ
విద్యుత్‌లైన్ పునరుద్ధరణ
యలమంచిలి రూరల్: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న రైలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యలమంచిలి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఘటనపై యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్‌కుమార్ ఫిర్యాదు మేరకు తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి కాకినాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఘటనకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ప్రమాదం సంభవించిన బోగీల్లో బీడీ కాల్చిన వ్యక్తితో పాటు కోచ్‌ల్లో బెడ్ రోల్స్ అందించే వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలను సోమవారం అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. అగ్నికీలలు వ్యాపించి దగ్ధమైన బోగీలను రైల్వే ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించాయి.
ఘటనపై బుధ, గురువారాల్లో దక్షిణ మధ్య రైల్వే సర్కిల్ సేఫ్టీ కమిషనర్ మాధవి విజయవాడలో విచారణ జరపనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిన వారు సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్డులో రైల్ నిలయం ఎదురుగా ఉన్న రైల్వే సేఫ్టీ కమిషనర్ అడ్రస్‌కు రాతపూర్వకంగా పంపించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఎ.శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు.


