న్యూఢిల్లీ: భారతీయ భౌతిక శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు ప్రతిష్టాత్మక ఓస్కార్ క్లెయిన్ మెడల్ లభించింది. ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త ఈయనే కావడం విశేషం. ఐసీటీఎస్–ఇన్ఫోసిస్ మాధవ ఛెయిర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సేన్ ఆధునిక స్ట్రింగ్ థియరీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ముఖ్యుడిగా పేరు. ఈ విశాల విశ్వం ఎలా పనిచేస్తోందో తెలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే ఈ స్ట్రింగ్ థియరీ.
దీని ప్రకారం విశ్వంలోని పదార్థం ప్రాథమిక భాగాలు ప్రొటాన్లు, న్యూట్రాన్లు కాదు.. అంతకంటే సూక్ష్మమైన పోగుల్లాంటి నిర్మాణాలు. తద్వారా ఈ సిద్ధాంతం పదార్థం, వాటి మధ్య ఉన్న శక్తుల గురించి వివరిస్తుంది. ప్రస్తుతం అందరూ అంగీకరించే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రకారం పదార్థం దాదాపు 12 రకాల భాగాలు (ప్రొటాన్, న్యూట్రాన్, మ్యుయాన్లు, లెప్టాన్లు వంటివి)తో నిర్మితమై ఉంటుంది.
శక్తిని కలిగి ఉండే మరో ఐదు కణాలు విద్యుదయస్కాంత శక్తి కలిగిన ప్రొటాన్లు, బలమైన అణుశక్తి కలిగిన ‘8 గ్లుయాన్స్(, బలహీనమైన అణుశక్తి కలిగిన ‘డబ్ల్యూ, డబ్యూ, జీ బోసాన్స్) కణాలు, హిగ్స్ బోసాన్‌లను కూడా కలుపుకుంటే ఈ విశ్వం ఎలా పనిచేస్తోందన్న విషయంపై స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే... ఇందులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించేందుకు స్ట్రింగ్ థియరీ ఉపయోగపడుతుందని అంచనా.
ఈ కొత్త సిద్ధాంతంపై అశోక్ సేన్ చాలాకాలంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 15న పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతాలో జన్మించిన అశోక్‌సేన్ స్థానిక ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఐఐటీ కాన్పూర్‌లో, అమెరికాలోని స్టోనీబ్రూక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. విశ్వ స్వరూపం, ప్రకృతి తాలూకూ మౌలిక నియమాలు, సూక్ష్మ కణాల ప్రవర్తన వంటి అత్యంత క్లిష్టమైన అంశాలపై పరిశోధనలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. భారత శాస్త్ర రంగానికి ప్రపంచ వేదికపై విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన శాస్త్రవేత్తలలో ఒకరు. ప్రస్తుతం బెంగళూరులోని ఐసీటీఎస్‌లో అధ్యాపకులుగా ఉన్నారు.
ఓస్కార్ క్లెయిన్ గురించి...
అశోక్ సేన్ అందుకోనున్న ఓస్కార్ క్లెయిన్ మెడల్ ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త పేరుతో 1988లో స్థాపితమైంది. స్టాక్‌హోమ్ యూనివర్శిటీ, నోబెల్ అవార్డులు అందించే రాయల్ స్వీడిష్ కమిటీలోని ఫిజిక్స్, విభాగం రెండూ సంయుక్తంగా ఈ మెడల్‌ను బçహూకరిస్తారు. అంతేకాకుండా క్లెయిన్ స్మారకార్థం ఏటా మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేస్తారు. 2026 సంవత్సరానికి గాను అశోక్ సేన్ ‘‘గ్రావిటీ ఫ్రమ్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ గ్రావిటీ’అన్న అంశంపై అక్టోబరు 22న ఈ లెక్చర్ ఇచ్చారు. అశోక్ సేన్ 2001లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.


