breaking news
ICTS
-
అశోక్ సేన్‌కు ఓస్కార్ క్లెయిన్ మెడల్
న్యూఢిల్లీ: భారతీయ భౌతిక శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు ప్రతిష్టాత్మక ఓస్కార్ క్లెయిన్ మెడల్ లభించింది. ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త ఈయనే కావడం విశేషం. ఐసీటీఎస్–ఇన్ఫోసిస్ మాధవ ఛెయిర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సేన్ ఆధునిక స్ట్రింగ్ థియరీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ముఖ్యుడిగా పేరు. ఈ విశాల విశ్వం ఎలా పనిచేస్తోందో తెలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే ఈ స్ట్రింగ్ థియరీ. దీని ప్రకారం విశ్వంలోని పదార్థం ప్రాథమిక భాగాలు ప్రొటాన్లు, న్యూట్రాన్లు కాదు.. అంతకంటే సూక్ష్మమైన పోగుల్లాంటి నిర్మాణాలు. తద్వారా ఈ సిద్ధాంతం పదార్థం, వాటి మధ్య ఉన్న శక్తుల గురించి వివరిస్తుంది. ప్రస్తుతం అందరూ అంగీకరించే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రకారం పదార్థం దాదాపు 12 రకాల భాగాలు (ప్రొటాన్, న్యూట్రాన్, మ్యుయాన్లు, లెప్టాన్లు వంటివి)తో నిర్మితమై ఉంటుంది. శక్తిని కలిగి ఉండే మరో ఐదు కణాలు విద్యుదయస్కాంత శక్తి కలిగిన ప్రొటాన్లు, బలమైన అణుశక్తి కలిగిన ‘8 గ్లుయాన్స్(, బలహీనమైన అణుశక్తి కలిగిన ‘డబ్ల్యూ, డబ్యూ, జీ బోసాన్స్) కణాలు, హిగ్స్ బోసాన్లను కూడా కలుపుకుంటే ఈ విశ్వం ఎలా పనిచేస్తోందన్న విషయంపై స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే... ఇందులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించేందుకు స్ట్రింగ్ థియరీ ఉపయోగపడుతుందని అంచనా. ఈ కొత్త సిద్ధాంతంపై అశోక్ సేన్ చాలాకాలంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 15న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించిన అశోక్‌సేన్ స్థానిక ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఐఐటీ కాన్పూర్‌లో, అమెరికాలోని స్టోనీబ్రూక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. విశ్వ స్వరూపం, ప్రకృతి తాలూకూ మౌలిక నియమాలు, సూక్ష్మ కణాల ప్రవర్తన వంటి అత్యంత క్లిష్టమైన అంశాలపై పరిశోధనలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. భారత శాస్త్ర రంగానికి ప్రపంచ వేదికపై విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన శాస్త్రవేత్తలలో ఒకరు. ప్రస్తుతం బెంగళూరులోని ఐసీటీఎస్లో అధ్యాపకులుగా ఉన్నారు.ఓస్కార్ క్లెయిన్ గురించి... అశోక్ సేన్ అందుకోనున్న ఓస్కార్ క్లెయిన్ మెడల్ ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త పేరుతో 1988లో స్థాపితమైంది. స్టాక్‌హోమ్ యూనివర్శిటీ, నోబెల్ అవార్డులు అందించే రాయల్ స్వీడిష్ కమిటీలోని ఫిజిక్స్, విభాగం రెండూ సంయుక్తంగా ఈ మెడల్‌ను బçహూకరిస్తారు. అంతేకాకుండా క్లెయిన్ స్మారకార్థం ఏటా మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేస్తారు. 2026 సంవత్సరానికి గాను అశోక్ సేన్ ‘‘గ్రావిటీ ఫ్రమ్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ గ్రావిటీ’అన్న అంశంపై అక్టోబరు 22న ఈ లెక్చర్ ఇచ్చారు. అశోక్ సేన్ 2001లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. -
భారత్‌లో మరో లిగో?
సాక్షి, హైదరాబాద్: గురుత్వ తరంగాలను గుర్తించేందుకు వాడే లిగో (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) వంటి ప్రయోగశాలను భారత్‌లోనూ ఏర్పాటు చేస్తారా? మరింత సున్నితమైన గురుత్వ తరంగాలను గుర్తించడంలో ఈ కొత్త లిగో కీలకపాత్ర పోషించనుందా? అవునంటున్నారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థిరాటికల్ సెన్సైస్ (ఐసీటీఎస్) శాస్త్రవేత్తలు. అమెరికా సాయంతో భారత్‌లో లిగో వంటి అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకటి చాలాకాలంగా ఉందని, తాజా ఆవిష్కరణతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు పెరిగాయని ఐసీటీఎస్ శాస్త్రవేత్త పరమేశ్వరన్ అజిత్ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (గాంధీనగర్), ఇంటర్ యూనివర్శీటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ (పూణే), రాజా రామణ్ణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఇండోర్)లు కలిసికట్టుగా ‘లిగో-ఇండియా’ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2012లోనే ఇందుకు కసరత్తు మొదలైంది. రూ.1,260 కోట్ల ఈ ప్రాజెక్టు కోసం రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేశారు. వీటిల్లో ఒకచోట కొత్త లిగో ఏర్పాటు కావచ్చు. కేంద్ర కేబినెట్ అనుమతి లభించాక పనులు చేపట్టి 2020 నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. 1992లో అమెరికాలోని కాల్టెక్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా గురుత్వ తరంగాల గుర్తింపునకు లిగోను ఏర్పాటు చేశాయి. దీంట్లో ఉన్న రెండు డిటెక్టర్లూ అమెరికాలోని లివింగ్‌స్టోన్ (లూసియానా), హాన్ఫర్డ్ (వాషింగ్టన్)లలో ఉన్నాయి. ఇవి కాకుండా జర్మనీ, ఇటలీ, జపాన్‌లలోనూ లిగో తరహా ప్రయోగశాలలున్నాయి. విశ్వం నుంచి భూమివైపుకు వచ్చే మరింత సున్నితమైన తరంగాల గుర్తింపు, అధ్యయనానికి ఇవి సరిపోవని శాస్త్రవేత్తల భావన. ఎక్కువ లిగోల ఏర్పాటు ద్వారా గురుత్వ తరంగాలు, స్థానిక ఇతర తరంగాలను వేరు చేయడం సులువని వీరి అంచనా. భారత్‌లో పరిశోధన శాల ఏర్పాటు ద్వారా తరంగాలు ఆకాశంలోని ఓ నిర్దిష్ట ప్రాంతం నుంచి వస్తున్నవేనని నిర్ధారించేందుకు వీలుంటుంది. లిగో సామర్థ్యాన్ని పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే విశ్వంలో ఇప్పటివరకూ మనం గమనించదగ్గ దూరాలకు మూడు రెట్లు ఎక్కువ దూరాల నుంచి వచ్చే గురుత్వ తరంగాలను గుర్తించవచ్చు.


