అంతకంతకూ వేడెక్కుతున్న పసిఫిక్
30 డిగ్రీ సెల్సియస్‌కు ఉపరితల ఉష్ణోగ్రతలు
మరింత పెరిగేందుకు అవకాశముందన్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలను మింగేసి వర్షాభావాన్ని రుచిచూపిస్తున్న ఎల్‌నినో అంతకంతకూ బలపడుతోంది. చరిత్రలోనే మొట్టమొదటిసారి పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్టోబరు 22న ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాగా.... ఇప్పుడిప్పట్లో తగ్గే సూచనలు కూడా లేవని, మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలు ఆందోళనకు కారణమవుతోంది.
దక్షిణ అమెరికా ప్రాంతంలో పసిఫిక్ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు. ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్‌నినో అని, తగ్గితే లా–నినా అని పిలుస్తూంటారు. దశాబ్దాలుగా ఈ రెండు వాతావరణ దృగి్వషయాలు కొన్నేళ్ల విరామంతో వస్తూ, పోతూ ఉండటం సహజంగానే జరుగుతోంది. అయితే భూతాపోన్నతి, కాలుష్యం వంటి అనేకానేక కారణాలతో ఇటీవలి కాలంలో ఎల్‌నినోలు తరచుగా వస్తూండటం గమనార్హం.
ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఏర్పడిన చాలా సందర్భాల్లో భారతదేశానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతూంటుంది. వర్షాభావం, అకాల వర్షాలు, వరదలు, కుంభవృష్టి వంటివి సంభవిస్తూంటాయి. అయితే ఇప్పటివరకూ వచ్చిన ఎల్‌నినోలు ఒక ఎత్తు అయితే 2026లోని ఎల్‌నినో ఇంకో ఎత్తు అంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రపంచ వాతావరణ విభాగం కూడా కొన్ని నెలలుగా ఈ ఏడాది వచ్చేది సూపర్ ఎల్‌నినో అని, దీని ప్రభావం వచ్చే ఏడాది వరకూ కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పసిఫిక్ మహా సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకోవడానికి ప్రాధాన్యం ఏర్పడింది.
అంతేకాదు... రానున్న డిసెంబరు వరకూ ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ విభాగం కూడా స్పష్టం చేస్తోంది. నినో 3.4 (ఎల్‌నినో కోసం శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతలు లెక్కించే ప్రాంతం) వద్ద జూన్ నెలలో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల సాధారణం కంటే 1.6 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది.
ఆగస్టు నాటికి ఇది 2.5 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంది. అక్టోబరు – డిసెంబరు మధ్యకాలంలో 3.7 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని ప్రపంచ వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. 2015 నవంబరు నుంచి 2016 జనవరి వరకూ ఈ ప్రాంతపు ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగి సృష్టించిన రికార్డు ఈ ఏడాది బద్దలవుతోందన్నమాట.
మనపై ప్రభావం ఎంత?
ఈ ఏడాది ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటు కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. అంతేకాకుండా అక్టోబరు నెలలో సగటు ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు నెలల్లోనూ చాలా చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశముందని భారతీయ వాతావరణ విభాగం చెబుతోంది. ఎల్ నినో పరిస్థితులకు మరికొన్ని అంశాలు తోడు కావడం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయన్నది తెలిసిన విషయమే. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు డిసెంబరు వరకూ కొనసాగే అవకాశం ఉండటంతో దీని ప్రభావం ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్


