పర్యాటక ప్రదేశాల్లో నూతన సంవత్సరాన్ని జరుపుకున్న భారతీయులు
ప్రార్థనా స్థలాల్లోనూ పోటెత్తిన భక్తులు
మాల్స్, రిసార్ట్‌లలోనూ ఊహించనంత సందడి
న్యూఢిల్లీ: కొంగొత్త ఆశలను మోసుకొచ్చే నూతన ఏడాదికి భారతీయులు తమదైన శైలికి స్వాగతం పలికారు. పలు రకాల సాంస్కృతిక, విభిన్న కార్యక్రమాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన రిసార్ట్‌లు, మాల్స్‌లో నృత్యాలు చేసి లక్షలాది మంది స్వాగతం పలికితే కోట్లాది మంది తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించేందుకు ఆలయాల వద్ద బారులుతీరారు. కొత్త ప్రదేశంలో సరికొత్తగా న్యూఇయర్‌కు స్వాగతం పలికాలనే ఉద్దేశంతో చాలా మంది పర్యాటక ప్రదేశాలకు పొలోమంటూ వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసిపోయాయి.
నేతల శుభాకాంక్షలు..
కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరికీ 2026 ఏడాది అ ద్భుతంగా గడవాలి. అందరికీ మంచి ఆయు రారోగ్యాలు ప్రాప్తించాలి. లక్ష్యాల సాధనకు మీరు చేసే కృషి ఫలించాలి. సమాజంలో శాంతి సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.
‘‘ ఆనందాల నూతన సంవత్సరంలో అందరికీ నా హృదయపూర్వక కొత్త ఏడాది శుభాకాంక్షలు. దేశ,విదేశాల్లోని భారతీయులందరికీ ఈ ఏడాది శుభం కలగాలి’’ అని రాష్ట్రపతి ముర్ము ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘కొత్త ఏడాది వేళ జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గౌరవప్రదంగా జీవించేందుకు, పనిచేసేందుకు, ఓటేసేందుకు అనువైన సమాజం కోసం ఉద్యమించాల్సిన తరుణమిది’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు.
వేడుకల్లోనూ రాజధానే
దేశరాజధానిగానే కాదు వేడుకలకూ ఢిల్లీ గురువారం రాజధానిగా మారింది. నగరంలోని ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతంలో జనం లెక్కలుమిక్కిలి చేరుకుని సరదాగా గడిపారు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఢిల్లీ మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్ల లోపల నుంచి బయటి దాకా చాలా దూరం వరకు క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఇండియా గేట్, సమీప ప్రాంతాలను చుట్టేసేందుకు వచ్చిన జనంతో సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌లో ఇసకేస్తే రాలనంత జనం పోగయ్యారు.
గోవాలో గోలగోల
సాధారణంగానే పర్యాటకానికి చిరునామాగా నిలిచే గోవా ఈసారి సైతం నూతన సంవత్సర సంబరాలకు సరికొత్తగా ముస్తాబైంది. దీంతో పలు రాష్ట్రాల జనం జనం పెద్దసంఖ్యలో గోవాకు చేరుకుని ఆనందంగా గడిపారు. బీచ్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు, బార్‌లు, నైట్‌క్లబ్‌లు, రోడ్డ మీద ఎక్కడ చూసినా జనమే కన్పించారు. మ్యూజిక్‌నైట్ పార్టీలు, బాణసంచా వెలుగులు, సంగీత విభావరులు, డ్యాన్స్ కార్యక్రమాలతో ఉత్తర గోవా హోరెత్తిపోయింది.
అన్ని రాష్ట్రాల్లో అందటా సందడే..
క్రైస్తవులు అత్యధికంగా ఉండే మిజోరంలో ప్రజలు చర్చిల్లో ప్రార్థనలతో నూతన ఏడాదికి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూఇయర్ వేడుకలను ఈ రాష్ట్రంలో రెండ్రోజులపాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం వర్షం ముంబై వాసులకు కొత్త ఏడాదిలోకి వెల్‌కమ్ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల్లో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేనంతగా కన్పించింది.
ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు తెల్లవారుజామునే గజగజ వణికించే చలిలోనూ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు చేసి ఆలయాలను దర్శించుకున్నారు. అయోధ్యలోని బాలరా మాలయం భక్తులతో కిటకిటలాడింది. వీఐపీ దర్శన పాస్‌లు హాట్‌కేకులుగా మారాయి. అనూహ్య రద్దీతో ఆలయ కమిటీ స్థానిక భక్తులను మరోరోజు దర్శనానికి రావాలని బ్రతిమాలింది. సుదూరాల నుంచి వచ్చిన భిన్న రాష్ట్రాల భక్తులకు దర్శనభాగ్యం దక్కే అవకాశం ఇవ్వాలని కోరింది. ఒడిశాలో పూరీ జగన్నాథస్వామి ఆలయంలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. బిహార్, రాజస్థాన్‌లోనూ ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి.
బెంగాల్‌లో భిన్నంగా..
బెంగాల్‌లో పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో నిండిపోయాయి. అలిపోర్ జూ, ఎకో పార్క్, ఇక్కో పార్క్, విక్టోరియా మెమోరియల్ సహా కోల్‌కతాలోని ప్రతి ప్రాంతంలో జనం గుమిగూడి కొత్త సంవత్సరాన్ని వేడుకలా ఆరంభించారు.


