భారత్ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ

India Resumes E Visa Services For Canadians - Sakshi

ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపర, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. ఈ వివాదంలో భాగంగానే భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది. 

నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెసింది కెనడా. పశ్చిమాసియా దేశాల పర్యటనల్లోనూ ట్రూడో ఈ అంశాన్ని లేవనెత్తారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల యూకే వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై స్పందించారు. నిజ్జర్ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు.. కానీ ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో దర్యాప్తు కోరకూడదని చెప్పారు. 

ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం

         

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top