
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది.
ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం.
.. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్‌పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..
రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్‌తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.