ఆ ఐదింటిలో... టాప్‌–10లో భారత్‌ | India leads the race in key technology sectors | Sakshi
Sakshi News home page

ఆ ఐదింటిలో... టాప్‌–10లో భారత్‌

Jun 26 2025 3:35 AM | Updated on Jun 26 2025 5:23 AM

India leads the race in key technology sectors

కీలక సాంకేతిక రంగాల పోటీలో ముందంజ

ఏఐ, అంతరిక్ష విభాగాల్లో మెరుగైన స్థానం

హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ :  కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్‌ టాప్‌–10లో చోటు సంపాదించింది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌కు చెందిన బెల్ఫర్‌ సెంటర్‌ ఫర్‌ సైన్స్అండ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ ‘క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఇండెక్స్‌’ అనే సూచీని రూపొందించింది. ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, అంతరిక్షం, క్వాంటమ్‌ టెక్నాలజీ విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరుల వంటి అంశాల ఆధారంగా దేశాలకు స్థానాలు కేటాయించారు.

ఏఐలో దూసుకుపోతూ..
కృత్రిమ మేధ విభాగంలో భారత్‌ దూసుకుపోతోందని చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం.. అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. ‘క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఇండెక్స్‌’ ఏఐ విభాగంలో జపాన్ , తైవాన్ , దక్షిణ కొరియా కంటే మనం ముందున్నాం. బయో టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్‌ అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో నంబర్‌ వన్‌. ఈ సూచీలోని బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, తైవాన్ , దక్షిణ కొరియాలను మనం అధిగమించాం

సిలికాన్‌ వేఫర్ల ఉత్పత్తిలో.. 
సెమీకండక్టర్ల తయారీలో వాడే సిలికాన్‌ వేఫర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్‌ వినియోగంలో 10 శాతం వాటా భారత్‌  కైవసం చేసుకుంది. చిప్‌ డిజైన్‌ సౌకర్యాలలో ప్రపంచంలో 7% మాత్రమే భారత్‌ కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని డిజైన్‌ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్‌లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు యూఎస్, యూరప్‌ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్‌ విభాగంలో మనం ఫ్రాన్స్కంటే ముందున్నాం. 

5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో
అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ‘మంగళ్‌యాన్‌’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి అడుగుపెట్టిన దేశం భారత్‌. ఈ సూచీలో అంతరిక్ష విభాగంలో జపాన్ , దక్షిణ కొరియా, తైవాన్  కంటే మనదేశం ముందుంది.  క్వాంటమ్‌ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మనదేశం 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటమ్‌ టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్‌ మించిపోవడం గమనార్హం.

ఏయే అంశాల ఆధారంగా స్కోర్‌ను నిర్ణయించారంటే...
ఏఐ
టాప్‌ మోడల్స్‌ కచ్చితత్వం, డేటా, ఆల్గరిధమ్స్, కంప్యూటింగ్‌ పవర్, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు.

బయోటెక్నాలజీ 
జన్యు ఇంజనీరింగ్, ఔషధాల తయారీ, వ్యాక్సిన్  పరిశోధన, వ్యవసాయ సాంకేతికత, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.

సెమీకండక్టర్స్‌
అసెంబ్లింగ్, టెస్టింగ్, ఎక్విప్‌మెంట్, తయారీ–ఫ్యాబ్రికేషన్ , చిప్‌ డిజైన్ – టూల్స్, ప్రత్యేక ముడిపదార్థాలు–వేఫర్స్, నియంత్రణ, అంతర్జాతీయంగాస్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు. 

స్పేస్‌
రిమోట్‌ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్ ్స, పొజిషనింగ్‌–నావిగేషన్ –టైమింగ్, సైన్ ్స– అంతరిక్ష పరిశోధన, దేశీయంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు 

క్వాంటమ్‌
క్వాంటమ్‌ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ ,  సెన్సింగ్,ప్రభుత్వ విధానాలు, అంతర్జా తీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement