
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కరులకు, వారి పోషకులకు తగిన బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన
ఆపరేషన్ సిందూర్‌కు 100 రోజులు పూర్తయ్యాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
స్వదేశీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలతో మనం విజయం సాధించామని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ఆయుధాల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని అన్నారు. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌లో శత్రువుపై ఎక్కుపెట్టిన స్వదేశీ ఆయుధాలు ఏమిటో తెలుసుకుందాం..
డి–4 డ్రోన్ల విధ్వంసకారి
డి–4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్‌లో తన వంతు సేవలు అందించింది. గగనతల నుంచి పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది. సాధారణ డ్రోన్లతోపాటు చిన్నపాటి మానవ రహిత యుద్ధ విమానాలను నేలకూల్చగలదు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలతోపాటు విదేశాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సైతం భారత సైన్యం ఉపయోగించింది. వాటిలో స్కై స్ట్రైకర్ కామికాజ్ డ్రోన్లు, బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు ఉన్నాయి. అంతేకాదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు కూడా ఈ ఆపరేషన్‌కు సహకరించాయి.
సమర్ ఎయిర్
డిఫెన్స్ సిస్టమ్
సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్(సమర్) అనేది ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలో ఒక భాగం. పాక్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులకు మధ్యలోనే కూలి్చవేసింది. భారత వైమానిక దళం సహకారంతో భారత రక్షణ రంగ పరిశ్రమలు దీన్ని రూపొందించాయి. గగనతలంలో తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, మానవ రహిత విమానాలను ఇది పేల్చేయగలదు. భారత సైన్యంలో ఇది కీలక అస్త్రంగా మారింది.
బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు
పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ శిబిరాలు, ఎయిర్‌బేస్‌లపై భారత సైన్యం మే 10వ తేదీన అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు ప్రారంభించింది. ఇందుకు బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు ఎంతగానో తోడ్పడ్డాయి. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్‌లో 20 శాతం వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
ఈ క్షిపణులను భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌డీఓపాటు రష్యా రక్షణ పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి ఇవి ప్రపంచంలో అత్యంత అధునాతనమైన క్షిపణులుగా గుర్తింపు పొందాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లను సబ్‌మెరైన్లు, నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూభాగం నుంచి ప్రయోగించవచ్చు. ఇవి ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. ప్రయోగించామంటే లక్ష్యాన్ని తాకాల్సిందే. గురితప్పే ప్రసక్తే లేదు. బ్రహ్మోస్ అంటే కేవలం ఆయుధం కాదు, భారతీయ సైనిక శక్తికి ప్రతీక అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు.
ఆకాశ్ క్షిపణి వ్యవస్థ
భారతదేశ ఐరన్ డోమ్‌గా పేరుగాంచిన ఆకాశ్ క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయి. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ మిస్సైళ్లను బీడీఎల్ తయారు చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడులు ప్రారంభించిన తర్వాత పాక్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించింది. ఇవి చాలావరకు తుర్కియే, చైనా సరఫరా చేసినవే. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ వాటిని సమర్థంగా తుత్తునియలు చేసింది. భారత భూభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆకాశ్ అనేది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌తో దీన్ని పోల్చుతుంటారు. ఆకాశ్ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలోని నాలుగు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు.