
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసింది. అధికార విధులను మీరి ప్రవర్తిస్తున్నాడని, హోదాకు తగ్గట్లు ప్రవర్తించట్లేడనే కారణంగా 24 గంటల్లోపు భారత్‌ను వీడాలని బుధవారం ఆదేశించింది. ఈమేరకు పాక్ హైకమిషన్‌లో సంబంధిత వ్యవహారాల ఉన్నతాధికారి సాద్ వరాయిచ్‌కు ‘అధికారికంగా దౌత్య నిరసన’ నోటీసును అందజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.