
భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంప్రదింపులు
అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయం కోసం మంతనాలు
నేడు హోటల్ తాజ్‌లో ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ‘ఇండియా’కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతు న్నారు. ఈ మేరకు గత గురువారం కూటమి నేతలతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.
ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం నేతలతో విస్త్రృతం చర్చలు కొనసా గిస్తున్నారు. కాగా, నేడు సోమవారం రాత్రి ఢిల్లీ లోని హోటల్ తాజ్‌లో కూటమి పార్టీల పార్లమెంటు సభ్యులకు ఖర్గే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అయితే, ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాల అభర్థిని ప్రకటించాలని ఇండియా కూటమిలోని ఒక వర్గం ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ఉభయసభల్లో 422 మంది, విపక్ష (ఇండియా) కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాని, బలం లేకున్నా బరిలో ఉండాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ఇండియా కూటమి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి అభర్థిని నిలబెట్టడంపై సమష్టి నిర్ణయం కోసం ప్రయత్నా లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి.