భూటాన్ ప్రధాని త్షెరింగ్ తోబ్గే ట్వీట్‌కు కామెంట్‌లో ఓ అభిమాని పెట్టిన ఫొటో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తనకు అన్నయ్యగా భావిస్తానని, ఆయనను విష్ణువు అవతారంగా చూస్తానని భూటాన్ ప్రధాని త్షెరింగ్ తోబ్గే తెలిపారు. మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ పొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, భూటాన్ అభివృద్ధి ప్రణాళికలకు భారత్ అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
ఢిల్లీలో 2019లో మోదీని కలిసిన సందర్భాన్ని తోబ్గే గుర్తు చేసుకున్నారు. అప్పటికి తాను భూటాన్ ప్రధానమంత్రి కూడా కాదని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా లేనని చెప్పారు. ఆ సమావేశంలో మోదీని తనకు అన్నయ్యగా భావిస్తున్నట్లు చెప్పానని, ఆయన తన పట్ల పెద్ద అన్నయ్య చిన్నవారిపై చూపే ఆప్యాయతను ప్రదర్శించారని తెలిపారు. అదే సందర్భంలో మోదీని విష్ణువు అవతారంగా చూస్తున్నానని చెప్పినట్లు వివరించారు.
ఆశ్చర్యపోయా..
అయితే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను కూడా ఆశ్చర్యపోయానని తోబ్గే తెలిపారు. తాను భావోద్వేగానికి లోనై అలా అన్నానా? తాను తప్పు చేశానా? అని ఆలోచించినట్లు చెప్పారు. తర్వాత మోదీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలించిన అనంతరం తాను చెప్పింది సరైనదేననే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.
మోదీ దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్‌ను పాలించిన తీరును తాను గమనించానని తోబ్గే చెప్పారు. అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులు, అమలు విషయంలో గుజరాత్‌ను ఒక నమూనాగా నిలిపారని పేర్కొన్నారు. అనంతరం అదే దృష్టిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మోదీ ప్రయత్నించారని, తయారీ, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సమ్మిళితం, పారిశుద్ధ్యం, సాంకేతికత, మౌలిక వసతులపై దృష్టి పెట్టారని అన్నారు.
ఇదీ చదవండి: భూకంపం తర్వాత రాజకీయ భూకంపం.. మోదీ సీఎం ఎలా అయ్యారు?
మోదీని మరోసారి కలిసినప్పుడు తన పాత వ్యాఖ్యపై మరింత ఆలోచించినట్లు తోబ్గే తెలిపారు. తాను ఏ అవతారం గురించి మాట్లాడానో అప్పటికి స్పష్టంగా తెలిసిందని, అది విష్ణువు చివరి అవతారంగా భావించే కల్కి అని చెప్పారు. ధర్మాన్ని పునరుద్ధరించడం, పునరుజ్జీవనానికి నాంది పలకడం కల్కి అవతారంతో ముడిపడి ఉన్న లక్షణాలని వివరించారు.
To Prime Minister @narendramodi, An avatar of our times https://t.co/84RDOEfELm
— Tshering Tobgay (@tsheringtobgay) October 7, 2026


