
పలు డ్రోన్ల సత్తా, ప్రతిదాడి సామర్థ్యాల పరిశీలన
హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ సారథ్యంలో విన్యాసాలు
మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్ సెక్టార్‌లో నిర్వహణకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు చెందిన వందల డ్రోన్ల దండు దండయాత్రకు దిగడంతో ప్రతిదాడి ఆవశ్యకతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కొనుగోలుచేసిన, సొంతంగా అభివృద్ధిచేసిన పలు రకాల డ్రోన్ల శక్తిసామర్థ్యాలను మరోసారి పునర్‌సమీక్షించాల్సిన తరుణం ఆసన్నమైంది. వచ్చే నెలలో ఈ మేరకు డ్రోన్ల విన్యాసాల కార్యక్రమానికి హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (హెచ్‌క్యూ ఐడీఎస్) శ్రీకారం చుట్టింది.
డ్రోన్ల శక్తిసామర్థ్యాలు, శత్రు డ్రోన్లను ఎదుర్కోవడం, వాటిని నేలమట్టంచేయడం వంటి కీలక బాధ్యతలను అవి ఏమేరకు నెరవేర్చుతాయనే అంశాలను ఈ ఎక్సర్‌సైజ్‌లో పరిశీలించనున్నారు. కౌంటర్–డ్రోన్ వ్యవస్థల పనితీరునూ బేరేజువేయనున్నారు. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో ఆర్మీ అ«దీనంలోని సెంట్రల్ సెక్టార్‌లో ఈ డ్రోన్ల విన్యాస కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ విన్యాసాల కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ జరిగిన ఐదు నెలల తర్వాత డ్రోన్ల ఎక్సర్‌సైజ్ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.
సైనికపర ఆలోచన, ఆచరణలో దూకుడు..
‘కోల్డ్ స్టార్ట్’ఎక్సర్‌సైజ్ విషయమై మంగళవారం ఢిల్లీలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సదస్సులో ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా, హెచ్‌క్యూఐడీఎస్‌లో డెప్యూటీ చీఫ్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌తో యుద్ధప్రాంతం, యుద్ధంచేసే తీరులో మార్పు వచి్చందని స్పష్టమైంది. ఇకపై సైనికపర ఆలోచన, ఆచరణలో మరింత దూకుడు అవసరం. ‘‘మానవరహిత వాయు వ్యవస్థలుగా ఎదిగిన డ్రోన్లరంగంలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తాం. ఈ ఎక్సర్‌సైజ్‌లో డ్రోన్ పరిశ్రమ వర్గాలు, పరిశోధకులు, నవ్యావిష్కర్తలు, బోధనారంగ ప్రముఖులు పాల్గొంటారు. ఇన్నాళ్లూ డ్రోన్ల కేవలం సహాయకారులుగా భావించాం. ఇకపై ఘర్షణల్లో అవి కీలకభూమిక పోషించనున్నాయి. నిఘా సమాచార సేకరణ, తక్కువ శ్రేణి దాడుల్లో డ్రోన్ల సామర్థ్యం అపారం.
శత్రువును డ్రోన్లతో ఏమార్చడం, మన స్థావరాలపై దాడులు చేయకుండా డ్రోన్లపై దాడి జరిగేలా చేసే శత్రు సామర్థ్యాలను వృథా చేయడం, మన స్థావరాలను సురక్షితంగా కాపాడుకోవడం వంటివెన్నో డ్రోన్లతో సాధ్యం’’అని ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా అన్నారు. ‘‘స్వల్ప పరిమాణంలో ఉన్న చిన్న డ్రోన్ల దండు దాడిచేయడం, ఆత్మాహుతి కామికాజి డ్రోన్లు దాడి చేయడం, నిఘా, పర్యవేక్షణ డ్రోన్లు చుట్టుముట్టడంతో ఇప్పుడు గగనతలం అనేది ఏమాత్రం క్షేమంకాదని అన్ని దేశాలకు తెలిసొచి్చంది. ఈ మేరకు సంక్లిష్ట విద్యుదయస్కాంత గగన క్షేత్రంలోనూ పైచేయి సాధించేందుకు ఆధునిక డ్రోన్లను అమ్ములపొదిలోకి చేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’’అని సిన్హా వ్యాఖ్యానించారు.