డిజిటల్ అరెస్టులకు హాట్‌స్పాట్ నగరాలివీ..
దేశంలో మూడింట రెండొంతుల కేసులు ఈ 3 ప్రాంతాల్లోనే..
ఈ ఏడాది మొదటి ఆరు నెలల డేటాను విశ్లేషించిన ఐ4సీ
డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను మోసం భారీగా డబ్బు కాజేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వృద్దులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఎంతో మంది కోట్ల రూపాయల్లో డబ్బు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే మహా నగరాల్లోనే ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది.
డిజిటల్ అరెస్టులకు (Digital Arrest) హాట్‌స్పాట్‌లుగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాలు అవతరించాయి. దేశంలో జరిగే సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల్లో మూడింట రెండింతల మోసాలు ఈ నగరంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనే దాదాపు 65 శాతం ఈ తరహా కేసులు నమోదు అవుతున్నట్లు ఇటీవల ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) జాతీయ మీడియాకు వెల్లడించింది.
బెంగళూరులో అత్యధికంగా 26.38% డిజిటల్ అరెస్టుల కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో 19.97% కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ నిలిచింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో డిజిటల్ అరెస్టుల కేసులు 18.14 శాతం నమోదు అయ్యాయి. ఈఏడాది మొదటి ఆరు నెలల డేటా ప్రకారం డిజిటల్ అరెస్టులు ఈ మూడు నగరాల్లో అత్యధికంగా జరుగుతున్నట్లు ఐ4సీ గుర్తించింది. ఇక తర్వాతి స్థానాల్లో ముంబై, సూరత్, పుణె, నాగపూర్, అహ్మదాబాద్, వడోదర నగరాల్లో కేసులు నమోదు అవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: బిహార్ ఎన్నికల్లో టాప్-10 ధనిక అభ్యర్థులు వీరే
టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్ (e-mail) తదితర మార్గాల ద్వారా లింకులు పంపడం, అవి క్లిక్ చేసిన వెంటనే నేరగాళ్లు అకౌంట్‌లో ఎంత ఉంటే అంత మొత్తాన్ని కాజేయడం చేస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ మోసాలకు సంబంధించిన 9.42 లక్షల సిమ్ కార్డులు, 2.63 లక్షల ఐఎంఈఐ నంబర్‌లను ఐ4సీ బ్లాక్ చేసింది. ఈ తరహా కేసుల్లో పోలీసు వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.


