ప్రభువా.. దీనజన బాంధవా
శివాజీనగర: సకల మానవాళిని పునీతుల్ని చేయడానికి ఇలపై ఏసుప్రభువు వెలసిన రోజే పవిత్ర క్రిస్మస్. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ కోసం వేచి చూస్తోంది. కర్ణాటకలో అందునా బెంగళూరులో పండుగ కోలాహలం ఉట్టిపడుతోంది. అన్ని షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటళ్లు కలర్‌ఫుల్‌గా మారాయి. ఎటు చూసినా క్రిస్మస్, నూతన సంవత్సరం వాతావరణం అలరిస్తోంది. స్టార్ లైట్లు, అలంకారాలతో అన్ని చర్చిలు ధగధగ మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ పాట్రిక్ చర్చ్, శివాజీనగరలోని సెయింట్ మేరీ బసిలికా చర్చ్, ఎంజీ రోడ్డులోని ఈస్ట్ పరేడ్ చర్చీ, రిచర్డ్ టౌన్‌లోని మిస్పా తెలుగు చర్చి, మార్తహళ్ళి అమాన చర్చీతో పాటుగా అన్ని నగరాలు, పట్టణాలలో క్రైస్తవ ప్రార్థనాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చీ సుందరంగా ముస్తాబైంది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనే తేడా లేకుండా ఏటా క్రిస్మస్ పర్వదినాన్ని ఆచరిస్తామని ఆ చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య తెలిపారు. ఏటా మాదిరిగానే గత నెల రోజులుగా క్యారెల్స్ వేడుకలను అన్ని చర్చ్‌లు ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నాయి. రాత్రివేళ ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ సంఘ సభ్యుల ఇళ్లకు వెళ్లి క్రిస్‌మస్ ఆనందాన్ని పంచుతున్నారు. కొన్ని చర్చ్‌లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మహిళా క్రిస్మస్, పిల్లల క్రిస్మస్ వేడుకలు జరిపారు.
అర్ధరాత్రి ఆరాధనలు
24వ తేదీ రాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఆరంభమవుతాయి. అర్ధరాత్రి విశేష ఆరాధన చేస్తారు. మంగళవారం ఉదయం నుంచే బెంగళూరులోని ప్రఖ్యాత చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ బసిలికా చర్చికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి ఆరాధనలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి చర్చీలో బాల ఏసు ప్రతిమను ఊయలలో ఉంచి పూజిస్తారు. పండుగ సందర్భంగా అలంకరణ సామగ్రి, స్టార్ దీపాలు, కేక్‌ల వ్యాపారం జోరందుకుంది. క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాజ్ దుస్తులకు గిరాకీ ఉంది.
అంతటా క్రిస్మస్ సందోహం
ముస్తాబైన చర్చిలు
మార్కెట్లలో పండుగ కోలాహలం
ప్రభువా.. దీనజన బాంధవా
ప్రభువా.. దీనజన బాంధవా
ప్రభువా.. దీనజన బాంధవా


