షాపులో 140 కేజీల వెండి చోరీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులో ఉన్న ఎయు జువెలరీస్‌లో సోమవారం రాత్రి దొంగలు పడి 140 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపును తెరవడానికి వచ్చిన ఉద్యోగులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్పీ కుశాల్ చౌక్సె, పోలీసులు, శునకాలతో వచ్చి ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగి ఉండవచ్చని ఎస్పీ అన్నారు. బాగా ఆరితేరినవారే కట్టర్‌తో ఇనుప గేట్ కు వేసిన తాళాలను కట్ చేసి లోపలకు చొరబడ్డారు, షోకేస్‌ల లో ఉంచిన వెండి సామగ్రిని దొంగిలించారు. బంగారు ఆభరణాలు మొత్తం లాకర్‌లో ఉన్నందున వాటిని తీయలేకపోయారు. మొత్తం రూ. 3 కోట్ల సొత్తు దొంగల పాలైంది అని ఎస్పీ తెలిపారు. ఆ షాపులోని సిసి కెమెరాల డివిఆర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కనున్న షాపుల కెమెరాల ఆధారంగా క్లూస్‌ని అన్వేషిస్తున్నారు.
లెక్చరర్.. పెళ్లిళ్లలో చోరీల దిట్ట
యశవంతపుర: లెక్చరర్ గా పనిచేస్తూ, పెళ్లిళ్లలో చోరీలకు పాల్పడుతున్న రేవతి అనే మహిళను బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. శివమొగ్గకు చెందిన రేవతి బెంగళూరు కేఆర్ పురలో నివాసం ఉంటుంది. బెళ్లందూరు సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్నడ లెక్చరర్‌గా పనిచేస్తుంది. ఆదివారమైతే చాలు.. ఎక్కడ పెళ్లి జరిగినా బంధువునే అంటూ వెళ్తుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఆప్యాయత కురిపిస్తుంది. విందు భోజనం ఆరగించి, బంగారు నగలను కొట్టేసి బయటపడుతుంది. శనివారం రాత్రి నుంచే ఫంక్షన్ హాళ్లకు వెళ్లి ఎక్కడ పెళ్లి ఉంటుందో తెలుసుకోవడం ఆమె ప్రత్యేకత. బసవనగుడి ఠాణా పరిధిలో మూడు చోరీలు చేసింది. రేవతి నుంచి రూ.32 లక్షల విలువగల 262 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సిలిండర్లపై దొంగల కన్ను
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఇటీవల గ్యాస్ సిలిండర్‌ల చోరీలు ఎక్కువయ్యాయి. దీంతో గృహిణులకు తంటా వచ్చి పడింది. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఒక నిండు సిలిండర్ అదనంగా ఉంటుంది. దానిని వరండాలోనో, కాంపౌండ్ లోపలో పెట్టి ఉంటారు. దొంగలు వాటిని మాయం చేస్తున్నారు. రాజాజినగర్‌లోని ఒక ఇంట్లో 2 సిలిండర్‌లను తీసుకున్న రోజే చోరీ అయ్యాయి. ఇంటి బేస్‌మెంట్‌లో పెట్టగా మళ్లీ కనబడలేదు. దొంగలు ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగలు సిలిండర్ డెలివరీ వాహనాన్ని ఫాలో చేస్తూ గమనించి తరువాత చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు వెతుకులాట చేపట్టారు.
జైల్లో స్నేహం.. కలిసి దొంగతనాలు
దొడ్డబళ్లాపురం: జైల్లో పరిచయమై స్నేహితులుగా మారి బయటకు వచ్చి చోరీలు చేస్తున్న ముగ్గురు చోరులను విద్యారణ్యపుర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.38.17 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు నగలను సీజ్ చేశారు. తిలక్ నగర నివాసి బాలరాజు (45), ఆడుగోడి గౌరవ్ (23), ప్రవీణ్ (26) పట్టుబడ్డ దొంగలు. పాత దొంగ అయిన బాలరాజుకు జైల్లో గౌరవ్, ప్రవీణ్ పరిచయమయ్యారు. బయటకు వచ్చాక కలిసి చోరీలు చేస్తున్నారు. భైరసంద్రలో జరిగిన ఒక చోరీ కేసులో దొరికారు.
గజదొంగకు సంకెళ్లు
దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో చోరీ చేసిన బంగారు నగలను కరిగించి విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఘరానా దొంగని జేపీ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.4.60 లక్షల నగదు, రూ.65 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహబూబ్ ఖాన్ పఠాన్, బెంగళూరు నాగవారలో నివసిస్తున్నాడు. ఇతనిపై ఏపీ, కర్ణాటక, తమిళనాడులో సుమారు 32 చోరీలు, దోపిడీల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జేపీ నగరలోని 20వ మెయిన్ రోడ్డులో ఒక ఇంట్లో దంపతులు బయటకు వెళ్తూ ఇంటి తాళాలను చెప్పుల స్టాండ్‌లోని ఒక షూలో ఉంచి వెళ్లారు. ఇంతలో పఠాన్ ఆ తాళం సాయంతో చొరబడి బంగారం దోచుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి నగదు,నగలు రికవరీ చేసుకున్నారు. బెంగళూరులోని పలు చోరీలు ఇతని పనేనని గుర్తించారు.


