‘పద్మాలయ’ పాత జ్ఞాపకమా! | Uttam Kumar Reddy comments over harish rao | Sakshi
Sakshi News home page

‘పద్మాలయ’ పాత జ్ఞాపకమా!

Dec 24 2025 4:27 AM | Updated on Dec 24 2025 5:21 AM

Uttam Kumar Reddy comments over harish rao

హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విసుర్లు 

ఆయన అలవాట్లు అందరికీ ఉండవు.. 

‘పాలమూరు’పై ఖర్చు చేసిన  రూ. 7 వేల కోట్లకు లెక్క చెబుతా 

బీఆర్‌ఎస్‌ ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచుకున్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘హరీశ్‌రావుకి అలాంటి అలవాటు ఉన్నట్టుంది. 

బడ్జెట్‌ రిలీజ్‌ అయితే జేబుల్లో నింపుకొని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చారో? ఆయన అలవాట్లు అందరికీ ఉండవు..ఆయనకు బహుశా ‘పద్మాలయా స్టూడియోస్‌ వంటి జ్ఞాపకాలు’ఉన్నాయేమో. గతంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు.. ప్రస్తుత మంత్రులపై నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. రూ.7 వేల కోట్లలో ప్రతి పైసాకి లెక్కచెప్తా. 

ఏ రైతులకు భూసేకరణ, పునరావాసం కోసం ఎంత ఇచ్చామో జాబితా ఇస్తా. వెళ్లి చూసుకోమనండి..’అంటూ మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్మాలయ స్టూడియోస్‌ వ్యవహారం ఏమిటని విలేకరులు వివరణ కోరగా.. ‘మీరు ఎవరిని అడిగినా చెబుతారు..’అని ఉత్తమ్‌ బదులిచ్చారు. హరీశ్‌ చెప్పిన ప్రకారమే చూస్తే.. ‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగు నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి ?’అని నిలదీశారు. 

పదేళ్లలో రూ.17.72 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయగా, అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లతో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు పోయే నాటికి తాము రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నీటిపారుదల శాఖ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని అన్నారు.  

మీ సభల్లో ఆంధ్రవాళ్లకు నీళ్లిచ్చామని చెప్పండి 
‘ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న సభల్లో.. ఆంధ్రవాళ్లకు మేము నీళ్లు, కాంట్రాక్టులు అప్పగించామని ప్రజలకు చెప్పుకోండి. డిండి ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి నీళ్లను తరలించాలి అన్న అంశంపై మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది.

మేము వచ్చాక ఏదుల రిజర్వాయర్‌ నుంచి తరలించాలని నిర్ణయించడంతో పాటు రూ.1,800 కోట్లతో పనులూ ప్రారంభించాం. కోవిడ్‌–19 కారణంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తిచే యలేకపోయామని సాకులు చెప్పుకుంటున్నారు. ఆ కోవిడ్‌ సమయంలోనే రూ.20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు ఎలా చేపట్టారు? 

పాలమూరుపై కేసీఆర్‌ కుట్రలు 
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీకు ఎందుకంత ప్రేమ? నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులంటే ఎందుకంత పక్షపాతం? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలు చేసింది. ప్రాజెక్టు పనుల వేగంతో పాటు పనుల సామర్థ్యాన్ని 1 టీఎంసీకి తగ్గించాలని, ఒకే సొరంగం పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2020 ఏప్రిల్‌ 8న నాటి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశారు. 2019లో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయడంతో అనుమతుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 

ఎత్తైన ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించగా, కమీషన్ల కోసం దిగువన ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేలా కేసీఆర్‌ మార్పులు చేసి వ్యయాన్ని పెంచారు. 35 శాతం ప్రాజెక్టు పనులు చేసి 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్‌ అబద్ధాలాడారు. ఈ ప్రాజెక్టుకి 90 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని ఇదే నెలలో కేంద్రానికి లేఖ రాశా. కానీ 45 టీఎంసీలకు తగ్గించాలని తాము కోరినట్టు హరీశ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..’అని ఉత్తమ్‌ మండిపడ్డారు. 

ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అడగకుండానే.. నాడు కేసీఆర్‌ ఇతర ప్రాజెక్టులకు 299 టీఎంసీల కేటాయింపులకు సమ్మతి తెలిపారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఇంత మోసం, దగా చేసి ఇప్పుడు పెద్దమనుషుల్లాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement