పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ట్రైనీ ఎస్‌ఐని కాకుండా అతడి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేయటంపై హైకోర్టు చిత్రదుర్గ పోలీసులపై అగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిపై పోలీసు యూనిఫాం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాలు.. చిత్రదుర్గ మహిళా పోలీసుస్టేషన్‌లో జరిగిన ఘటనకు సంబంధించి దావణగెరెకు చెందిన ఎం.దర్శన్ దాఖలు చేసిన అర్జీని హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారించారు.
పోలీసుల వైఖరిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైనీ ఎస్‌ఐ ఒక యువతిని ప్రేమించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిని వదిలేసి తప్పు చేయని అతడి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు చేయని వ్యక్తిని నిందితుడిగా పోలీసులు చూపించటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి అతడి గౌరవ మర్యాదలు ఏం కావాలని పోలీసులను నిలదీశారు.
ఖాకీ దుస్తులు వేసుకుంటే ఏమైనా చేయవచ్చా?
పోలీసులు ఖాకీ దుస్తులు వేసుకుంటే ఏం కావాలన్నా చేయవచ్చనే ధీమా కనపడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోస్ట్ వాటెండ్ వ్యక్తులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను బదిలీ చేయటమే కాదు.
సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు అదేశిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. చిత్రదుర్గ మహిళా పోలీసులు ఈ కేసులో నేరుగా హాజరయ్యారు. ముఖ్య నిందితుడిని వదిలేసి అతడి తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించి చిత్రదుర్గ మహిళా స్టేషన్ ఎస్‌ఐపై శాఖాపరమైన విచారణ చేయాలని అదేశించారు. కింది కోర్టులు ఇలాంటి విషయాన్ని తేలికగా తీసుకోవద్దని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
-బెంగళూరు


