రూ.50 లక్షల సుపారీతో జిమ్‌ ట్రైనర్‌ హత్య? | Gym Trainer Vijay Murder Case | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల సుపారీతో జిమ్‌ ట్రైనర్‌ హత్య?

Jun 23 2026 11:48 AM | Updated on Jun 23 2026 11:56 AM

Gym Trainer Vijay Murder Case

కర్ణాటక : జిమ్‌ ట్రైనర్‌ విజయ్‌ హత్య కేసులో ఒక పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త ప్రమేయం ఉందని మృతుని కుటుంబం ఆరోపణలు చేసింది. మరోవైపు పోలీసులు ఆదివారంనాడు నలుగురిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు.. కోలారు జిల్లా, ముళబాగిలుæకు చెందిన జిమ్‌ ట్రైనర్‌ విజయ్‌ యాదవ్‌ (35), బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జూన్‌ 10న రాగిహళ్లి సమీపంలో అతని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. పోలీసులు విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాల ఆధారంగా శ్రీరామ్, సుమిత్, వెంకటేశయ్య, బాబు అనే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.  

ఏం జరిగిందంటే... 
విజయ్‌ బంధువు, న్యాయవాది వాసుదేవరెడ్డి ఈ కేసుపై స్పందిస్తూ, ‘విజయ్‌  కోలారు జిల్లాలోని ముళబాగిలువాసి. సుమారు ఏడాది క్రితం బెంగళూరుకు వచ్చి అక్కడే ఉంటూ జిమ్‌ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అతనికి జిమ్‌లో ఒక యువతితో పరిచయమైనట్లు తెలిసింది. ఆ యువతి తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ప్రముఖ రియల్టర్‌– వ్యాపారవేత్త. తన కూతురితో మాట్లాడవద్దని అతడు విజయ్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. 

దీంతో విజయ్‌ సొంతూరికి వెళ్లిపోయాడు. ఆ యువతి విజయ్‌ను వెతుకుతూ ముళబాగిలుకి వచ్చింది. అంతకుముందు, ఆ యువతి, విజయ్‌ 21 రోజుల పాటు ఉత్తర భారతదేశంలో టూర్‌కి వెళ్లారు. కే.ఆర్‌.పురం పోలీస్‌స్టేషన్‌లో యువతి అదృశ్యం కేసు కూడా నమోదైంది. విజయ్‌ బెంగళూరు విడిచి వెళ్లాలని ఆమె తండ్రి తీవ్రంగా హెచ్చరించాడు.  ఇదంతా చూసి విజయ్‌ భార్య విడాకులు, భరణం కోసం కేసు దాఖలు చేసింది, అది కోర్టులో విచారణలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విజయ్, బెంగళూరు కె.ఆర్‌.పురానికి తిరిగి వచ్చి ఒక జిమ్‌లో ట్రైనర్‌గా చేరాడు.  ఈ హత్యకు పాల్పడిన వారు రౌడీషీటర్లు. 

వారికి ఆ యువతి తండ్రి  రూ.25 లక్షల నుంచి 50 లక్షల సుపారి ఇచ్చి హత్య చేయించాడు. కొంతమంది న్యాయవాదులు ఈ సుపారీని కుదిర్చారు. ఈ హత్య వెనుక ఆ న్యాయవాదులే ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ న్యాయవాదులను కూడా అరెస్టు చేయాలి’ అని వాసుదేవ రెడ్డి డిమాండ్‌ చేశారు. డీఐజీ ఎస్‌. గిరీష్‌ స్పందిస్తూ, ‘ఈ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతాం,‘ అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement