ప్రియురాలి భర్త సడన్‌ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి.. | Man falls from 10th floor amid affair claim, fact check says false | Sakshi
Sakshi News home page

ప్రియురాలి భర్త సడన్‌ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..

May 30 2026 7:42 AM | Updated on May 30 2026 8:20 AM

Man falls from 10th floor amid affair claim, fact check says false

వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఒక ఫిట్‌నెస్‌ ట్రైనర్‌–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. 

సోషల్‌ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్‌ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్‌ మావో". అతనొక చైనా జిమ్‌ ట్రైనర్‌. తన క్లయింట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్‌ పోస్టుల సారాంశం. 

 ప్రస్తుతం ఎక్స్‌, టిక్‌టాక్‌ తదితర వేదికల్లో వైరల్‌ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. 

అయితే.. సాక్షి.కామ్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్‌లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. 

వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్‌ ట్రైనర్‌ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. 

వైరల్‌ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్‌ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్‌ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్‌ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్‌ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. 

వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్‌ ట్రైనర్‌, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement