యూసీబీ యాప్‌ల ప్రారంభం సందర్భంగా అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పట్టణంలో అదనంగా కనీసం ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు(యూసీబీ) శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నిర్దేశించారు. రెండు లక్షలకు మించి జనాభా కలిగిన పట్టణాల్లో ఐదేళ్లలోగా ఈ అదనపు శాఖలను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం ఆయన అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ రంగంపై జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో మాట్లాడారు. దేశంలో నగదు రహిత లావాదేవీలు విస్తృతమవుతున్నందున డిజిటల్ చెల్లింపు విధానాన్ని యూసీబీల్లో కూడా అమల్లోకి తీసుకు రావాలన్నారు. రెండేళ్లలో 1,500 బ్యాంకుల్లో దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సహకార్ డిజి పే, సహకార్ డిజి లోన్ అనే రెండు మొబైల్ అప్లికేషన్లను ప్రారంభించారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల్లో సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రిజర్వు బ్యాంకు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. ఈ రంగంలో నిరర్ధక ఆస్తులను గత రెండేళ్ల కాలంలో 2.8 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గించగలిగామన్నారు. సంస్కరణలు అమలు, క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైందని అమిత్ షా చెప్పారు.
ఇదే ఒరవడిని కొనసాగించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ లిమిటెడ్ (నాఫ్‌కబ్)కు ఆయన పిలుపునిచ్చారు. విజయవంతంగా నడుస్తున్న సహకార పరపతి సంఘాలను యూసీబీలుగా మార్చాలన్నారు. అమూల్, ఇఫ్కోలను ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయెన్స్ ప్రపంచంలోనే రెండు అతిపెద్ద సహకార వ్యవస్థలుగా గుర్తించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సహకార విధానం ఇప్పటికీ ఆచరణీయమేనని ఇది రుజువు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కర్నాటక న్యాయశాఖ మంత్రి, నాఫ్‌కబ్ గౌరవాధ్యక్షుడు హెచ్‌కే పాటిల్ ప్రసంగిస్తూ.. మూసివేత ప్రమాదంలో ఉన్న 20 యూసీబీలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లాభదాయకం కాదంటూ మూసివేయడం సరైన విధానం కాదని చెప్పారు.


