వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published Wed, Sep 13 2023 9:13 AM

Gajendra Shekhawat: Will Pull Out tongue Gouge eyes Of anyone Speaks Against Sanatan - Sakshi

జైపూర్‌: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత వారం రాజస్తాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడారు.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఇటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాలి. సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి. వారి కళ్లు పెరికివేయాలి. సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారికి అధికారం, పదవులు దక్కనివ్వరాదు’అని పేర్కొన్నారు.  

హిందూయిజంతో ప్రపంచానికే ప్రమాదం: రాజా
చెన్నై: హిందూమతంపై తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీకే చెందిన ఎంపీ ఎ.రాజా హిందూమతాన్ని హెచ్‌ఐవీ, కుష్టు వ్యాధితో పోల్చారు. తాజాగా ఎంపీ రాజా మరోసారి హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై తాజాగా విడుదల చేశారు.

‘కులమనే ప్రపంచ వ్యాధికి హిందూమతానిదే బాధ్యత. భారత్‌ కులం ఆధారంగా ప్రజలను విడదీస్తోంది. సామాజిక అస్థిరత, ఆర్థిక అసమానతలను సృష్టించేందుకు కులాన్ని వాడుకున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు హిందూయిజం పేరుతో  కులాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారత్‌కే కాదు, ప్రపంచానికే హిందూమతం ప్రమాదకరం’అని ఆయన అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 
చదవండి: ప్రధాని మోదీకి ఖలిస్తానీ నేత హెచ్చరిక

Advertisement
 
Advertisement