పక్కా ఏవిడెన్స్‌.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు | Found Concrete Evidence That Youtuber Jyoti Malhotra Spied For Pak | Sakshi
Sakshi News home page

పక్కా ఏవిడెన్స్‌.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు

Aug 16 2025 4:52 PM | Updated on Aug 16 2025 5:28 PM

Found Concrete Evidence That Youtuber Jyoti Malhotra Spied For Pak

హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. యూట్యూబర్‌పై 2,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను హిసార్ కోర్టులో దాఖలైంది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్థారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

జ్యోతి మల్హోత్రాపై అఫిషియల్ సీక్రెట్స్ చట్టంలోని సెక్షన్లు 3, 5తో పాటు బీఎన్ఎస్‌లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చార్జ్‌షీట్‌ను పరిశీలించిన అనంతరం న్యాయపరంగా స్పందిస్తామంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరిట ట్రావెల్ వ్లాగ్‌ నడిపేంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. మూడు నెలల పాటు సిట్‌ అధికారులు విచారణ చేశారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్‌లోని అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 2,500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను హిసార్ కోర్టులో సిట్ శనివారం దాఖలు చేసింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఆమె ఐఎస్‌ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్‌లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. పాకిస్తాన్‌లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్‌ను కలిసినట్లు సమాచారం. ఆమె మొబైల్ ఫోన్, డిజిటల్ డేటా ద్వారా గూఢచర్యానికి సంబంధించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.

కాగా, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్‌ సైనిక నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హై కమిషన్‌లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకోగా.. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్‌ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది.

హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నడిపేది. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ట్రావెల్‌ బ్లాగర్‌గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్‌చేశారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు వెళ్లింది.

అక్కడ ఎహ్సాన్‌ ఉర్‌ రహీమ్‌ అలియాస్‌ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్‌ ఆదేశానుసారం అలీ అహా్వన్‌ అనే వ్యక్తి ఈమెకు పాక్‌లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్‌లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్‌ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్‌బాజ్‌లతో పరిచయం పెంచుకుంది. షహ్‌బాజ్‌ ఫోన్‌నంబర్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో జాట్‌ రంధావా అనే వేరే పేరుతో సేవ్‌చేసింది.

వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాప్‌ యాప్‌లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్‌ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్‌ అనుకూల వీడియోలు తీసి పోస్ట్‌చేసింది. పాక్‌లో కతాస్‌ రాజ్‌ టెంపుల్‌ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్‌ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement