
ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్ భారంపై తగు చర్యలు తీసుకుంటాం
పార్లమెంట్‌లో వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ భరోసా
న్యూఢిల్లీ: అరడజను సార్లు అమెరికా, భారత ప్రతినిధులు భేటీ అయినా చర్చలు ఓ కొలిక్కిరాకపోవడంతో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా, ఇష్టారీతిక విధించిన 25 శాతం దిగుమతి సుంకంపై భారతసర్కార్ పార్లమెంట్ సాక్షిగా స్పందించింది. భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని లోక్‌సభ, రాజ్యసభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
నేటి నుంచి 25 శాతం టారిఫ్‌లతోపాటు పెనాల్టీలను భారత్‌పై మోపుతానని ట్రంప్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ, రాజ్యసభల్లో గోయల్ కీలక ప్రకటక చేశారు. ‘‘ హఠాత్తుగా ఏకపక్షంగా ట్రంప్ మనపై అదనపు టారిఫ్‌లను మోపారు. దీని దుష్ప్రభావాలపై విస్తృతస్తాయి అధ్యయనం చేస్తున్నాం.
ఇందులోభాగంగా టారిఫ్‌ల భారం పడే రైతులు, ఎగుమతిదారులు, కార్మికులు, వ్యాపారులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పలు పరిశ్రమల సమాఖ్యలు, సంఘాలతో మంతనాలు జరుపుతున్నాం. పెను ప్రభావం తాలూకు పరిణామాలపై విశ్లేషణ చేపడుతున్నాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాం. పౌర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతాం’’ అని గోయల్ అన్నారు.
‘‘ కేవలం దశాబ్దకాలంలోనే దుర్భల ఆర్థిక వ్యవస్థ నుంచి సుదృఢ ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ తయారైంది. 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ర్యాంక్ నుంచి టాప్–5 ర్యాంక్‌లోకి భారత్ ఎగబాకింది. మన కర్షకులు, కార్మికులు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కృషి, మా ప్రభుత్వ పట్టుదల ఈ ప్రగతికి కారణం.
భవిష్యత్తులో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ప్రపంచ తయారీరంగ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గత దశాబ్దకాలంగా కృషిచేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా భారతీయ ఉత్పత్తుల గణనీయ పెరుగుదలకు పాటుపడ్డాం. నైపుణ్య మానవ వనరులు, యువత కారణంగానే భారతీయ పరిశ్రమల్లో పోటీతత్వం, నవకల్పనలు ఎక్కువయ్యాయి.
గత 11 సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో భారత్ లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. రైతులు, భారత సాగు రంగం బాగు కోసం, ఆహార భద్రత కోసం ప్రభుత్వం పాటుపడుతోంది. ఇకమీదటా అదే పనిచేస్తాం. అమెరికా టారిఫ్‌ల అంశంలో భారత ప్రయోజనాలకు పణంగా పెట్టే ప్రసక్తే లేదు’’ అని గోయల్ వ్యాఖ్యానించారు.
డెయిరీ విషయంలో మరింత అప్రమత్తంగా..
డెయిరీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఏ దేశంతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదర్చుకోలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 కోట్ల జనాభా దేశ సాగురంగంపై ఆధారపడిన నేపథ్యంలో ఆహారభద్రత సంక్షోభంలో పడకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోభాగంగానే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా సాగురంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం ఓ కంట కనిపెడుతోంది. 2021–25 వాణిజ్యగణాంకాల ప్రకారం భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి.