చిన్నారిపై మీరట్ డాక్టర్ ప్రయోగం
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది.
ఫెవిక్విక్‌తో వైద్యం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం జాగృతి విహార్‌కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి.
కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట.
కంగుతిన్న వైద్యులు
ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్‌ను (ఫెవిక్విక్‌ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు.
విచారణకు ఆదేశం..
ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


