పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్‌ ఇంతలా ఉంటాయా? | Feeling Sad for Her Husband: Viral Reunion Video Splits Social Media | Sakshi
Sakshi News home page

పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్‌ ఇంతలా ఉంటాయా?

Jun 30 2026 12:42 PM | Updated on Jun 30 2026 1:35 PM

Feeling Sad for Her Husband: Viral Reunion Video Splits Social Media

ఏళ్ల తరబడి దూరమైన ఇద్దరు స్కూల్‌ స్నేహితులు మళ్లీ కలుసుకున్న క్షణం... ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యం. సాధారణంగా హృదయాలను తాకాల్సిన ఆ 42 సెకన్ల వీడియో.. సోషల్‌ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చకు తెరలేపింది. కొందరు దాన్ని స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా కొనియాడితే.. మరికొందరు అనుమానాల కోణంలో చూడడంతో రచ్చ రచ్చగా మారింది..

సోషల్‌ మీడియాను ఓ వైరల్‌ వీడియో కుదిపేస్తోంది. వీడియోలో ఓ మహిళ 14 ఏళ్ల తర్వాత తన పాత స్కూల్‌ స్నేహితుడిని కలుస్తుంది. అతను విదేశాల్లో సెటిల్‌ అయ్యాడట. తన వివాహానికి కూడా రాలేదట. తనకంటే తన కూతురు ఆ అంకుల్‌ను కలవడానికి ఎగ్జయిటింగ్‌గా ఉందని వీడియో షేర్‌ చేసింది. పైగా తనను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్‌ చేస్తూ.. తన కూతురితో పాటు తనకూ లాలీపాప్‌ ఇచ్చాడని సంబురంగా చెప్పింది. 

ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరూ ఆనందంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపిస్తుంది. చివర్లో.. ఆనాడు.. ఈనాడు అంటూ ఓ ఫొటోను ఉంచిందామె. ఆ వీడియో ఎక్కడిది? అందులో ఉంది ఎవరు? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ,  ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ వివాహిత మహిళ ఇలా ఒంటరిగా కలవడం సరైందేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు.

ఇంజినీర్‌ ఆదిత్య అనే ఎక్స్‌ (X) యూజర్‌ ఈ 42 సెకన్ల వీడియోను.. మీ ఆయన్ని తల్చుకుంటే బాధగా ఉంది "Feeling sad for her husband" అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. మిలియన్‌ పైగా వ్యూస్‌.. వేలాది లైక్‌లను సొంతం చేసుకోవడమే కాకుండా, కామెంట్ల రూపంలో పెద్ద చర్చకు దారితీసింది.

అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ప్రతి పురుషుడు–మహిళ మధ్య ఉండే బంధాన్ని ప్రేమగా చూడాల్సిన అవసరం లేదు", "14 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిస్తే అలాంటి ఆనందం సహజమే", "ఇది ఎంతో స్వచ్ఛమైన స్నేహం" అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కూడా బిడ్డను తీసుకెళ్లడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

కొందరు నేరుగా వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తినే విమర్శించారు. "నీ తల్లిని తల్చుకుంటే బాధగా ఉంది.. ఎలాంటి కొడుకును కన్నదో ఆమె", "నీ భార్యను తల్చుకుంటేనే బాధగా ఉంది", "అరేయ్‌.. అసలు నీ ఆలోచనా విధానమే బాగోలేదురా", "స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా తప్పుగా చూడొద్దు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మరికొందరు "ద్వేషపూరిత క్యాప్షన్‌ను పక్కన పెడితే వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది" అంటూ స్పందించారు.

ఈ ఘటనతో మరోసారి పెళ్లైన ఓ మహిళ, ఓ పురుషుడి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉండగలదా? అనే అంశంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఒక వర్గం ప్రతి బంధాన్ని అనుమానంతో చూడకూడదని వాదిస్తుంటే, మరొక వర్గం సామాజిక పరిమితుల గురించి మాట్లాడుతోంది. మొత్తానికి, ఇద్దరు పాత స్నేహితుల భావోద్వేగ కలయికగా మొదలైన ఈ వీడియో... ఇప్పుడు స్నేహం, నమ్మకం, సామాజిక దృక్పథం గురించి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ చర్చకు కేంద్రబిందువుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement