25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్‌.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా! | Failed 25 Times Now at the Age of 55 he did MSC | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: 25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్‌.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా!

Published Wed, Nov 29 2023 8:04 AM | Last Updated on Wed, Nov 29 2023 8:04 AM

Failed 25 Times Now at the Age of 55 he did MSC - Sakshi

‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌)కు చెందిన రాజ్‌కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్‌కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్‌కరణ్‌ ఎట్టకేలకు ఎంఎస్‌సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. 

ఈ విజయాన్ని సాధించడానికి రాజ్‌కరణ్ తన  సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్‌కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్‌కరణ్‌కు గణితంలో ఎంఎస్‌సీ చేయాలనే ఆలోచన  వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్‌సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్‌పూర్‌)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. 

ఎట్టకేలకు 2020లో ఎంఎస్‌సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్‌సీ ఫైనల్‌ను పూర్తి చేశాడు. రాజ్‌కరణ్‌ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్‌కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్‌ కరణ్‌ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్‌కరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్‌ కరణ్‌ తెలిపాడు. ఫెయిల్యూర్‌తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్‌ కరణ్‌  సలహా ఇస్తుంటాడు.
ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్‌ సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement