67 నుంచి 76 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)తో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ముందంజలో ఉన్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠ్‌బంధన్ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుందని స్పష్టంచేసింది. ఎన్డీయేకు 121 నుంచి 141 వరకు, విపక్ష మహాగఠ్‌బంధన్‌కు 98 నుంచి 118 స్థానాలు వస్తాయని తెలియజేసింది.
ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. బిహార్ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలను బుధవారం ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే రాష్ర్టీయ జనతాదళ్(ఆర్జేడీ) 67 నుంచి 76 స్థానాలు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది.
జేడీ(యూ)కు 56 నుంచి 62 స్థానాలు, బీజేపీకి 50 నుంచి 56, కాంగ్రెస్‌కు 17 నుంచి 21, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి 3 నుంచి 5, వామపక్షాలకు 10 నుంచి 14 స్థానాలు దక్కుతాయని తెలియజేసింది. ఎన్డీయేకు 43 శాతం ఓట్లు, మహాగఠ్‌బంధన్‌కు 41 శాతం, జన సురాజ్ పార్టీకి కేవలం 4 శాతం ఓట్లు లభిస్తాయని వివరించింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని 34 శాతం మంది, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ మరోసారి సీఎం కావాలని 22 శాత మంది కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఎన్డీయేకు 41 శాతం పురుషుల ఓట్లు, 45 శాతం మహిళల ఓట్లు, మహాగఠ్‌బంధన్‌కు 42 శాతం పురుషుల ఓట్లు, 40 శాతం మహిళల ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది.



