ఉద్ధవ్‌ ‘సేన’లో చీలిక  | Eknath Shinde said the six Shiv Sena-UBT MPs have joined the Shiv Sena | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌ ‘సేన’లో చీలిక 

Jun 23 2026 5:04 AM | Updated on Jun 23 2026 5:04 AM

Eknath Shinde said the six Shiv Sena-UBT MPs have joined the Shiv Sena

ఆరుగురు ఎంపీలు షిండే శివసేనలోకి 

సిక్స్‌ కొట్టామన్న ఏక్‌నాథ్‌ షిండే 

ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతమని వ్యాఖ్య

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ అధికారికంగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు అధికార పక్షం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. తాజా పరిణామంతో శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. తాజా పరిణామంతో శివసేనపై షిండే పట్టు మరింత బలపడటంతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది. 

సోమవారం ముంబైలో షిండే, సీనియర్‌ నేతలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్‌ వర్గంలోని ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. అనంతరం, ఆరుగురితో కలిసి షిండే మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతంగా పూర్తయిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ రోజు ఇక్కడ నా పక్కన ఏకంగా ఆరు పులులున్నాయి. ఈసారి మేం సిక్స్‌ కొట్టాం’అని చెప్పారు. ఈ 6 ఎంపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన రాజకీయ దురంధరులు అంటూ పొగిడారు. వీరి చేరిక కోసం పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతంగా పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. 

13కు చేరిన షిండే వర్గం ఎంపీలు  
ఢిల్లీలో ఐదు రోజుల క్రితం జరిగిన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ భేటీకి మొత్తం 9 మంది ఎంపీలకుగాను ఆరుగురు డుమ్మాకొట్టగా ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆ ఆరుగురే తాజాగా షిండే పార్టీలో చేరారు. వారు..సంజయ్‌ దేశ్‌ముఖ్, సంజయ్‌ జాదవ్, సంజయ్‌ దినా పాటిల్, నగేశ్‌ పాటిల్, ఓం ప్రకాశ్‌ రాజే నింబాల్కర్, భావుసాహెబ్‌ వాక్‌చౌరె ఉన్నారు. వీరంతా కలిసి బయటకు రావడంతో ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ ఈ వర్గానికి లభించినట్లయింది.

ఉద్ధవ్‌ భేటీకి ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా 
శివసేన(యూబీటీ)లో మరో ముసలం మొదలయిందా అంటే, అవుననే అంటున్నారు. సోమ వా రం ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే శివసేనలో చేరారు. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఏర్పాటు చేసిన భేటీకి ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు మొహం చాటేయడమే ఇందుకు కారణంగా మారింది. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శివసేన(యూబీటీ) ప్రధాన కార్యాలయం శివాలయ్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. భేటీకి ఎమ్మెల్యేలు సంజయ్‌ పొట్నిస్, రాహుల్‌ పాటిల్, ఎమ్మెల్సీ సునీల్‌ షిండే డుమ్మా కొట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement