డ్రోన్.. స్టార్టప్‌లు పెరిగెన్‌ | Drone technology startups are growing rapidly in the country | Sakshi
Sakshi News home page

డ్రోన్.. స్టార్టప్‌లు పెరిగెన్‌

Jun 8 2025 2:44 AM | Updated on Jun 8 2025 2:44 AM

Drone technology startups are growing rapidly in the country

యూఎస్‌ తరవాత అత్యధికం భారత్‌లోనే

ఐఐటీ గ్రాడ్యుయేట్లవే అత్యధికం

కంపెనీల్లోకి వెల్లువెత్తుతున్న నిధులు

గతేడాది రెండింతలు పెరిగిన ఫండింగ్‌

2016తో పోలిస్తే ఏకంగా 5,389% వృద్ధి

మొత్తం రూ.4,882 కోట్ల పెట్టుబడులు

డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్  సిందూర్, రష్యా–ఉక్రెయిన్  యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను  డ్రోన్స్ స్టార్టప్స్‌ అందిపుచ్చుకుంటున్నాయి. 

మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్‌ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్  కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్‌ అవకాశాలను అంచనా వేయొచ్చు.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

దేశంలో డ్రోన్‌ టెక్నాలజీ స్టార్టప్‌లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్‌లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్  తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. 

ఈ రంగంలోని టాప్‌–100 స్టార్టప్స్‌లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్  ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్‌ స్టార్టప్‌లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్‌ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.

బెంగళూరు టాప్‌..
డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్‌–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్‌ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్  కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్‌ నుంచి 14 మంది, బిట్స్‌ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్‌ స్టార్టప్స్‌ను అందించిన టాప్‌ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.

వెన్నుతడుతున్న ప్రభుత్వం..
ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్‌ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్‌ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్‌నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్‌ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్  సింగిల్‌ విండో సిస్టమ్‌ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

నిధులు వెల్లువెత్తాయి..
దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్  కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి.  2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్‌ ఊపు మీద ఉంది.  2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్  4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్  కంపెనీలు అందుకున్నాయి. 

ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్‌లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్, ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థుల స్టార్టప్స్‌ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement