
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా 10,91,146 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు రూ. 1,865.68 కోట్ల ఉత్పాదకత సంబంధిత బోనస్ (PLB) చెల్లింపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. దీనిని దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు అందించనున్నారు.
ఇది భారతీయ రైల్వేలోని 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇందుకోసం 2024-25 సంవత్సరానికి రూ. 1,866 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. కేంద్ర మంత్రివర్గం గత ఏడాది అక్టోబర్ మూడున 11.72 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత-సంబంధిత బోనస్ చెల్లింపును ఆమోదించింది. రైల్వే సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్‌బీ) రూ.1,865.68 కోట్ల చెల్లింపునకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అర్హులైన రైల్వే ఉద్యోగులకు (Railway Employees) ఏటా దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు పీఎల్‌బీని చెల్లిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 10.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లించనున్నారు. రైల్వేల పనితీరు మెరుగుపడేలా కృషి చేసిన ఉద్యోగులకు ప్రేరణనిచ్చే ప్రోత్సాహకంగా పీఎల్‌బీ ఉపయోగపడనుంది.
అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ కింద చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ఈ మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకులు, పాయింట్స్ మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్- సి సిబ్బంది వంటి వివిధ కేటగిరీల్లోని రైల్వే సిబ్బందికి చెల్లిస్తారు. 2024-25లో రైల్వేలు రికార్డు స్థాయిలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేయడంతోపాటు దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

వీటికి కూడా క్యాబినెట్ ఆమోదం
పరిశోధనల ప్రోత్సాహానికి 2,277 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సిఎస్ఐఆర్ (CSIR) పథకం కింద మానవ వనరుల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నట్లు ప్రకటించింది. రీసెర్చ్ ఫెలోషిప్ లకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది. అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపు, ప్రమోషన్ అందించేలా క్యాబినెట్ ఒక పథకానికి రూపకల్పన చేసింది.