సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టనున్న నిరసనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి, నగరంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీజేపీ మద్దతుదారుల్ని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనకు అనుమతి కోరుతూ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, భద్రతాపరమైన ఆందోళనలు, ముందస్తు నోటీసు గడువు పాటించకపోవడం, గత నిరసనల్లో నిబంధనల ఉల్లంఘనలను కారణాలుగా చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసన చేపడతామని సీజేపీ నాయకులు ప్రకటించారు.
ధృవ్ రాఠీ అరెస్ట్?.. దీప్కే కోసం..
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ‘ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితులతో భయపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని.. నిరసనలకు అనుమతి లేకపోయినా వెనక్కి తగ్గబోమని ఆయన ప్రకటించారు.
మరోవైపు, నిరసనలో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన యూట్యూబర్ ధృవ్ రాఠీ అరెస్ట్ అయినట్లు సమాచారం. గురుగ్రామ్‌లో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ నిరసనలకు మద్దతు తెలుపుతున్న ప్రకాశ్ రాజ్‌ను సైతం పోలీసులు అడ్డుకోవచ్చనే సమాచారం అందుతోంది. మరోవైపు దీప్కేను కూడా అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. నిరసనకారుల వరుస అరెస్టుల నేపథ్యంలో సీజేపీ శ్రేణులు అప్రమత్తం అయ్యాయి.
STORY | YouTuber Dhruv Rathee detained by Delhi Police ahead of CJP protest: Sources YouTuber Dhruv Rathee was detained by Delhi Police from his residence in Gurugram's Sector 56 on Saturday ahead of the Cockroach Janta Party's (CJP) proposed protest at Jantar Mantar, police sources said. READ: https://t.co/xKTbD2i8AY
— Press Trust of India (@PTI_News) October 10, 2026
సరిహద్దుల్లో భారీ బందోబస్తు
నిరసన నేపథ్యంలో ఢిల్లీ అంతటా సుమారు 35 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. జంతర్ మంతర్‌తోపాటు ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, నగర సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఇంటర్నెట్ స ఏవల్ని నిలిపివేశారు. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా వ్యవస్థల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిరసన ప్రభావంతో పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలపై ఆంక్షలు విధించగా, రైళ్లను కూడా రద్దు చేశారు.
ఇదీ చదవండి: ఎన్ని కేసులైనా పర్వాలేదు.. జైలుకైనా వెళ్తా


