జైలుకైనా సిద్ధం.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం: అభిజీత్ దీప్కే | we will ensure gyanesh kumar resigns abhijeet dipke | Sakshi
Sakshi News home page

జైలుకైనా సిద్ధం.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం: అభిజీత్ దీప్కే

Oct 10 2026 9:33 AM | Updated on Oct 10 2026 9:38 AM

we will ensure gyanesh kumar resigns abhijeet dipke

న్యూఢిల్లీ: ఓట్ల తొలగింపు ఆరోపణలపై పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్త అభిజీత్ దీప్కే ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరగనున్న ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి బయలుదేరిన సందర్భంగా ఆయన ఏఎన్ఐతో మాట్లాడారు. జైలుకు పంపుతామనే బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని దీప్కే పేర్కొన్నారు. తమపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) వంటి చట్టాలను ప్రయోగించినా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలిపారు.

దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని దీప్కే ఆరోపించారు. ఈ కారణంగా ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో విధించిన ఆంక్షలపైనా దీప్కే ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తికి రక్షణ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధానిని మొత్తం స్తంభింపజేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైలు సేవలను నిలిపివేశారని, మెట్రోను మూసివేశారని, రహదారులను దిగ్బంధించారని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని విమర్శించారు.

మరోవైపు, నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 35 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ఏఎన్ఐ తెలిపింది. శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై జవాబుదారీతనం కోరడమే నిరసన ఉద్దేశమని సీజేపీ తెలిపింది. నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని పార్టీ పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement