నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన | CJP Leader Saurav Das Alleges Phone Number Leak Gets 300 Calls in an Hour | Sakshi
Sakshi News home page

నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన

Oct 10 2026 7:29 AM | Updated on Oct 10 2026 7:35 AM

CJP Leader Saurav Das Alleges Phone Number Leak Gets 300 Calls in an Hour

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేడు (శనివారం) ప్రతిపాదించిన నిరసన ప్రదర్శనకు ముందు ఆ పార్టీ సహ సమన్వయకర్త సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసులు తన ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేశారని, దీంతో వరుసగా ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం గంట వ్యవధిలోనే 300కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని శుక్రవారం అర్ధరాత్రి సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. తన ఫోన్ నంబర్‌ను ఎవరు, ఏ ఉద్దేశంతో బహిర్గతం చేశారన్నది నిర్ధారణ కాలేదన్నారు.

పోలీసుల పత్రాల్లో నంబర్ బయటపడిందని..
ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన పత్రాల్లో తన ఫోన్ నంబర్ కనిపించిందని సౌరవ్ దాస్ ఆరోపించారు. గతంలో నిర్వహించిన నిరసనకు సంబంధించిన హామీ పత్రాలు, తాజాగా ప్రదర్శనకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు పంపిన లేఖలో ఈ వివరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ పత్రాలు బహిరంగంగా ప్రచారంలోకి రావడంతో తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇతరులకు చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు.

గంటలో 300కు పైగా కాల్స్.. 
ఫోన్ నంబర్ బయటపడిన తర్వాత తనకు పెద్ద సంఖ్యలో కాల్స్, వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని దాస్ తెలిపారు. గంటలోనే 300కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్‌ను తొలగించకుండానే సంబంధిత పత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మీడియా సంస్థల తీరుపైనా సౌరవ్ దాస్ విమర్శలు గుప్పించారు. అవి ఏదో అత్యంత రహస్యమైన పత్రాలు తమ చేతికి చిక్కినట్లుగా ప్రచారం చేశాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యవహారంలో ఏ మీడియా సంస్థల పాత్ర ఎంత ఉందన్నదిస్పష్టంగా తెలియడం లేదు.

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పిలుపు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపైనా ఆ సంస్థ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలోనే సౌరవ్ దాస్ ఫోన్ నంబర్ బహిర్గతమైందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కాగా ప్రతిపాదిత నిరసనకు అనుమతి ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. నిరసన నిర్వహణకు  చాలా తక్కువ సమయం ఉందనగా సమాచారం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. గత నిరసన సందర్భంగా నిబంధనలు, ఆదేశాలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతోపాటు శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన సమస్యలను కూడా కారణాలుగా చూపించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement