
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మరణాల మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ధర్మస్థళ సమీప ప్రాంతాల్లో వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా, ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) విచారణ చేపట్టింది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. వీటిలో ఒక చోట తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ దొరికిన పాన్, ఏటీఎం కార్డులు విచారణ అధికారులకు బెంగళూరులోని ఒక ఇంటికి దారి చూపాయి.
ఆ ఏటీఎం కార్డు బెంగళూరు రూరల్ ప్రాంతంలోని నేలమంగళలో నివసిస్తున్న సిదాలక్షమ్మకు చెందినదని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే ఆ పాన్ కార్డు ఆమె కుమారుడు సురేష్ కు చెందినదని, మద్యానికి బానిసైన అతను గత మార్చిలో మృతిచెందాడని తేలింది. ధర్మస్థళ సందర్శన సమయంలో సురేష్ తన కార్డులు పోగొట్టుకున్నాడని, అవి నేత్రావతిలో కొట్టుకుపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తన కుమారుడు తాగుడుకు బానిస అయిన కారణంగా ఇంటి నుంచి తరచూ వెళ్లగొట్టేదానినని సిదాలక్షమ్మ అధికారులకు తెలిపింది.
తన కుమారుడు మూడేళ్ల పాటు కామెర్ల వ్యాధితో బాధపడ్డాడని, ఈ సమయంలో అతను ఎక్కడకూ వెళ్లలేదని, అయితే జీవనోపాధి చూసుకోవాలని తామే అతనిని ఇంటికి దూరంగా ఉంచామని సిదాలక్షమ్మ తెలిపింది. తాము ఐదేళ్ల క్రితం కుటుంబ సమేతంగా ధర్మస్థళికి వెళ్లామని, అప్పట్లో తన కుమారుడు తన ఏటీఎం వినియోగిస్తున్నాడని, నాడు ఎటీఎం, పాన్ కార్డులు పోయాయని తనకు చెప్పాడని సిదాలక్షమ్మ వివరించింది. ఈ సంగతి చెప్పగానే తాను ఏటీఎం కార్డు బ్లాక్ చేయించానన్నది. తన కుమారుడు సురేష్ చనిపోయాక ఖననం చేశామని, ఆమె తెలిపింది. మాజీ పారిశుధ్య కార్మికుడు సూచించిన 13 ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టినప్పుడు అధికారులకు ఏటీఎం, పాన్ కార్డులు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని సిట్ అధికారులు గతంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?