6 నెలలు దాటి రిజర్వ్‌లో ఉన్న కేసుల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందే: సుప్రీంకోర్టు
పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ చర్యలు
అన్ని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం సూచన
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు తీర్పులను రిజర్వ్ చేసిన తేదీ, వెలువరించిన తేదీ, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తేదీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది.
ఇందుకోసం ప్రతి హైకోర్టు తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా, ఆరు నెలలకు పైగా రిజర్వ్‌లో ఉండిపోయిన తీర్పుల వివరాలను, ఆరు నెలల తర్వాత వెలువరించిన తీర్పుల సంఖ్యను తప్పనిసరిగా ఈ డాష్‌బోర్డులో వెల్లడించాలని స్పష్టం చేసింది.
అసలు ఎందుకీ ప్రతిపాదన?
జార్ఖండ్ హైకోర్టులో తీర్పులు సుదీర్ఘకాలం పాటు రిజర్వ్‌లో ఉండిపోతున్న ఉదంతానికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే పారదర్శకత అత్యవసరమని అభిప్రాయపడింది. అంతేగాక ‘ప్రతి హైకోర్టులో, ఏ న్యాయమూర్తి ఎన్ని తీర్పులు రిజర్వ్ చేశారు, వాటిలో ఎన్ని వెలువరించారు, ఎన్ని రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేశారు.. అనే వివరాలు ప్రజలందరికీ తెలియాలి.
ఆరు నెలలు దాటినా వెలువరించని తీర్పులు ఎన్ని? ఆరు నెలల తర్వాత వెలువరించినవి ఎన్ని? అన్నింటికంటే ముఖ్యంగా, తీర్పు వెలువరించిన తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతోంది అనేది స్పష్టంగా తెలియాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ నొక్కిచెప్పారు. దీనికి జస్టిస్ బాగ్చి స్పందిస్తూ, ‘ఇది ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల పారదర్శకతను, జవాబుదారీతనాన్ని చూపిస్తుంది’ అని అన్నారు.
హైకోర్టులకు ఆదేశాలు
ఈ ఏడాది జనవరి 31లోపు రిజర్వ్ చేసి, మే 5, 2025 నాటికి కూడా వెలువరించని తీర్పుల వివరాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌ను గతంలోనే ఆదేశించింది. బుధవారం నాటి విచారణలో, కొన్ని హైకోర్టులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని, మిగిలినవి ఇంకా సమర్పించలేదని ధర్మాసనం గుర్తించింది.
నివేదిక ఇవ్వని రిజిస్ట్రార్ జనరల్స్ రెండు వారాల్లోగా అఫిడవిట్లు సమర్పించాలని, లేనిపక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా, అమికస్ క్యూరీ ఫౌజియా షకీల్ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, అన్ని హైకోర్టులకు మరికొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత విధానంలో భాగంగా తీర్పు రిజర్వ్, వెల్లడి, అప్‌లోడ్ తేదీల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ప్రస్తుతం హైకోర్టులు అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలపాలని చెప్పింది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల ఏవైనా ఇబ్బందులు లేదా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని భావిస్తే, ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పింది. నాలుగు వారాల్లోగా ఈ వివరాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలనిరిజిస్ట్రార్ జనరల్స్‌కు సూచించింది.


