లాఠీలు ఝళిపించడం, టియర్ గ్యాస్‌లు.. వాటర్ కేనన్‌లు ప్రయోగించడం, బలప్రయోగానికి దిగడమే నిరసనలను అడ్డుకునే మార్గమా? ఏమాత్రం కాదు.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని మేధావులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. అలాగే సుప్రీం కోర్టు సైతం ఇటు మొట్టికాయలు వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహాంతో సాంకేతిక నిఘా, పక్కా ప్రణాళికల ద్వారా ఢిల్లీ పోలీసులు ఈసారి ప్రతి అడుగులోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు.
జంతర్ మంతర్ వద్ద శనివారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తలపెట్టిన ‘జంతర్ మంతర్ 2.0’(Jantar Mantar 2.0) నిరసనను అడ్డుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. గత కొన్నిరోజులుగా ఈసీ వ్యతిరేక నిరసనల్లో వాళ్ల వ్యవహర శైలి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇప్పుడు.. కాక్రోచ్‌ల ర్యాలీ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది సిబ్బందిని మోహరించి, బాడీ కెమెరాలతో నిఘా పెట్టారు. వేదికకు చేరుకోక ముందే కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు. గత నిరసనల్లో ఎదురైన విమర్శలు పునరావృతం కాకుండా ఈసారి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారన్న చర్చ మొదలైంది.
Ahead of the CJP protest ,Delhi Police personnel are equipped with body cams that record everything even in the dark 💪 https://t.co/6ZTA11IAZ3
— Boiled Anda (@AmitLeliSlayer) October 10, 2026
ఈసారి ‘నీట్’గా..
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ పరిణామాలపై న్యాయపరమైన సవాళ్లు, విచారణ కోరుతూ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అదే సమయంలో.. తమపైనా దాడులు జరిగాయని.. సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు మొత్తుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఢిల్లీ పోలీసులు తీరు మార్చుకోవాలంటూ కోర్టులు సైతం అక్షింతలు వేస్తూ వచ్చాయి.
जंतर-मंतर पर प्रदर्शन से पहले पुलिस का एक्शन! 🚨 CJP के प्रदर्शनकारी हिरासत में Cockroach Janta Party (CJP) के प्रदर्शन के लिए जुट रहे कुछ प्रदर्शनकारियों को दिल्ली पुलिस ने हिरासत में लिया। #Delhi #DelhiPolice #JantarMantar #CJP #BreakingNews #News https://t.co/Jhx34Fnrwm
— PRIYA RANA (@priyarana3101) October 10, 2026
ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు మరో విధంగా సిద్ధమయ్యారు. నిరసనకారులు గుమిగూడిన తర్వాత పరిస్థితిని అదుపు చేయడం కంటే, వారు నిర్దేశిత ప్రాంతానికి చేరుకోకముందే కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు. నిరసనకు అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి కీలక రహదారుల వరకు తనిఖీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకు వస్తున్నారనే అనుమానంతో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
బాడీ కెమెరాలతో ఆధారాలు.. చీకట్లోనూ రికార్డింగ్
ఈసారి పోలీసుల వ్యూహంలో ప్రత్యేకంగా కనిపించిన అంశం బాడీ కెమెరాలు. విధుల్లో ఉన్న సిబ్బంది యూనిఫామ్‌లకు అమర్చిన ఈ కెమెరాలు చీకట్లోనూ ఘటనలను రికార్డు చేయగలవు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినా, తోపులాట చోటుచేసుకున్నా ఏం జరిగిందో ఫుటేజీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
గతంలో పోలీసులపై దురుసు ప్రవర్తన, అధిక బలప్రయోగం వంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఘటనాస్థలంలో ఏం జరిగిందన్న దానిపై వివాదాలు తలెత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితుల్లో ఆధారాలు అందుబాటులో ఉండేలా కెమెరాలను ఉపయోగించారు. తమపై దాడులు జరిగినా, తాము ఎవరిపైనా అనుచితంగా వ్యవహరించలేదని నిరూపించుకోవాల్సి వచ్చినా ఈ ఫుటేజీ ఉపయోగపడుతుందని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. అంటే కెమెరాలు నిరసనకారుల కదలికలను మాత్రమే కాదు.. పోలీసుల చర్యలనూ రికార్డు చేస్తాయి.
మహిళా సిబ్బందికి రక్షణగా ‘పింక్ ఫోర్స్’
మహిళా పోలీసుల భద్రతకూ ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. గత నిరసనల్లో మహిళా సిబ్బందిని తోసివేయడం, దురుసుగా ప్రవర్తించడం, దుస్తులు, బ్యాడ్జీలను చించివేయడం వంటి ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మహిళా బృందమైన ‘పింక్ ఫోర్స్’ను రంగంలోకి దించారు. నిరసనకారులను నియంత్రించే సమయంలో మహిళా సిబ్బందికి రక్షణ కల్పించడం, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం ఈ బృందం లక్ష్యం.
విమానాశ్రయంలోనే నేతలకు అడ్డుకట్ట
నిరసనలో కీలక పాత్ర పోషించనున్న నేతలను కూడా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగకముందే నిర్బంధించారు. సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సహా మరికొందరినీ అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి వందల మందిని ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధించారు.
🚨 ABHIJEET DIPKE, SAURAV DAS AND ASHUTOSH RANKA DETAINED FROM INSIDE THEIR FLIGHT 🚨 Shame on you @narendramodi @AmitShah https://t.co/hXl6bzh53i
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026
మెట్రో, రైళ్లు, ఇంటర్నెట్‌పైనా ఆంక్షలు
నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరకుండా రవాణా వ్యవస్థపైనా కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీ మెట్రోలో 45 స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. జనపథ్–కర్తవ్య పథ్ కూడలి చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపైనా తాత్కాలిక ఆంక్షలు అమలు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను కలిపి 35 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం మోహరించారు.
పక్కా ప్రణాళికతో కట్టడి కానీ..
ముందస్తు నిర్బంధాలు, బాడీ కెమెరాలు, ప్రత్యేక మహిళా బలగాలు, రవాణా ఆంక్షలు.. ఇలా అనేక చర్యలను ఒకేసారి అమలు చేసి నిరసనకారులు భారీగా గుమిగూడకుండా పోలీసులు ప్రయత్నించారు. నిరసనను అడ్డుకోవడంలో వారి వ్యూహం గణనీయమైన ప్రభావం చూపింది. అయితే, ప్రజా రవాణా నిలిపివేత, ఇంటర్నెట్ ఆంక్షలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
#WATCH | A passenger who was onboard the flight on which Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke was travelling to Delhi says, "We were travelling from Mumbai. We had to wait even after the flight landed. After the flight landed, we could hear sloganeering of 'Inquilab Zindabad' from the front of the aircraft. I don't know who Dipke is. They must be 'Cockroach' who must be behaving like this; I don't know much...They were on a protest for 36 days earlier. But will they create inconvenience everywhere? Public is inconvenienced due to a few people like this. If the names of people have been wrongfully deleted, Supreme Court will look into it. They (protesters) are not going to look into it. Shut down Courts if public will do everything. There is a system which we follow, shut down that system. If there is a problem, we will protest - will that help?"
— ANI (@ANI) October 10, 2026
శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యతే. అదే సమయంలో నిరసన తెలిపే హక్కును, సాధారణ ప్రజల ప్రయాణ స్వేచ్ఛను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి పోలీసులు బలప్రయోగం కంటే ముందస్తు ప్రణాళిక, సాంకేతిక నిఘాకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: లాఠీ పట్టని లేడీ సింగాన్ని చూశారా?


