
న్యూఢిల్లీ: లోక్‌సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్‌పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్‌టీ కారిడార్ సమీపంలో బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుడు సోహన్ రావత్ ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్ మొబైల్ నంబర్‌ను అందించింది. ఫలితంగా రావత్ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.