న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబి.. పేలుడుకు వారం ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేస్తూ వచ్చాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 10న దాడి జరగగా, దానికి వారం రోజుల ముందు ఉమర్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గల తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే ముందు తన వద్ద ఉన్న రెండు ఫోన్‌లలో ఒకదానిని తన సోదరునికి ఇచ్చాడు.
శ్రీనగర్, ఫరీదాబాద్‌లలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఉమర్ సహచరులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు చేయడంతో ఉమర్ సోదరుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ మర్నాడు ఉమర్ మరో సహోద్యోగి డాక్టర్ షాహీన్ సయీద్ కూడా అరెస్టు అయినట్లు ఉమర్ సోదరునికి తెలిసింది. ఉమర్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న సోదరుడు భయంతో ఉమర్ ఇచ్చిన ఫోన్‌ను వారి ఇంటి సమీపంలోని ఒక చెరువులో పడేశాడు. దర్యాప్తు అధికారులు ఉమర్ ఫోన్‌ల కోసం గాలించారు. ఆ రెండు ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని, వాటి చివరి స్థానాలు ఢిల్లీ, పుల్వామాలో ఉన్నట్లు గుర్తించారు.
అధికారులు పుల్వామాలోని ఉమర్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిని విచారించగా, అతను చెరువులో పడేసిన ఫోన్ గురించి వెల్లడించాడు. నీటిలో పడి, పాడైపోయిన ఆ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ మదర్‌బోర్డ్ కూడా పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, అధికారులు అతి కష్టం మీద.. ఆ ఫోనులో.. ఉమర్ ఆత్మాహుతి బాంబు దాడులను సమర్థిస్తూ చేసిన కీలక వీడియోను రికవరీ చేయగలిగారు. మంగళవారం బహిర్గతమైన ఆ వీడియోలో.. ఇస్లాంలో ఆత్మహత్యను నిషేధించినప్పటికీ, ఉమర్ దానిని సమర్థిస్తూ బలిదాన చర్యలుగా అభివర్ణించాడు. అలాగే మరణానికి భయపడవద్దు అనే సందేశాన్ని వినిపించాడు.
ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్‌చిట్


