వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. తమ స్వప్రయోజనాల కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)ను వెనుకేసుకొచ్చారు. 2018లో జరిగిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్‌కు ఏమీ తెలియదన్నారు. ఖషోగ్గి చాలా వివాదాస్పదుడని, చాలా మందికి నచ్చని వ్యక్తి అని అభివర్ణించారు. ఖషోగ్గి హత్యపై ఓవల్ కార్యాలయంలో యువరాజును ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్రశ్నలతో తమ అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు 2021 నాటి యూఎస్ నిఘా అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. నాటి వివరాల ప్రకారం ఖషోగ్గిని చంపడానికి ప్రిన్స్ మొహమ్మద్ ఆదేశించినట్లు తేలింది. కాగా అమెరికా తొలి పర్యటనలో ఉన్న ఎంబీఎస్ మాట్లాడుతూ ఖషోగ్గి హత్య బాధాకరమైనదని, అదొక పెద్ద తప్పిదం అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఖషోగ్గి భార్య హనన్ ఎలాటర్ ఖషోగ్గి స్పందిస్తూ, ఎంబీఎస్ తనను కలిసి క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదాన్ని పక్కన పెడుతూ అమెరికా- సౌదీ అరేబియా తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటూ పలు కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపాయి.
ఇందులో పౌర అణుశక్తి సహకార ఒప్పందం, భవిష్యత్తులో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ల అమ్మకం మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఎంబీఎస్ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. అలాగే మానవ హక్కులను కాపాడేవాడని కూడా అని కొనియాడారు. కాగా గతంలో సౌదీతో తలెత్తిన దౌత్య సంక్షోభానికి కారణమైన ఖషోగ్గి హత్యను పక్కన పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ వ్యాపార ప్రయోజనాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మారాయి. ట్రంప్ ఆర్గనైజేషన్‌తో సౌదీ డెవలపర్ కొత్త హోటల్ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రాంతీయ శాంతి, ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ (అబ్రహం ఒప్పందాలు) గురించి కూడా ట్రంప్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చించారు.
ఇది కూడా చదవండి: Bihar: ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’.. కొత్త ఎమ్మెల్యేలకు పండుగే!


