న్యూఢిల్లీ: ‘పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్‌లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.

మరో నిరసనకారురాలు జ్యోత్స్న సింగ్ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ‘పేదలు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ బస్సులు, ఆటోల నుంచి వచ్చే ఉద్గారాలతో జనం బాధపడుతున్నారు. ఇవి కాలుష్యానికి 80 శాతం దోహదం చేస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు రావాలి’ అని అన్నారు. ‘ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గువస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటివాటిని పట్టించుకోదు. పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటుంది’ అంటూ డీయూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
అని మరో నిరసనకారిణి ప్రేరణ మెహ్రా ‘కాలుష్యం పెరిగిన తరుణంలో ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీటిని చల్లుతున్న వీడియోలను చూసిన తర్వాత నేను ఒక దానిని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తప్పుదారి పట్టిస్తున్నారా? లేదా నీటిని వ్యర్థం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వసంత్ కుంజ్‌కు చెందిన 76 వృద్ధుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజలు అవే బాధలను ఎదుర్కొంటున్నారు. నా మనవళ్ల కోసం నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతిచోటా నిర్మాణాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది’ అని అన్నారు.

నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ కార్యకర్త విమ్లేందు ఝా ఈ అణిచివేతను ఖండించారు. 15 రోజులుగా లాక్‌డౌన్ లేదు, షట్‌డౌన్ లేదు కేవలం క్లౌడ్ సీడింగ్ లాంటి పనులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ మహలా మాట్లాడుతూ తాము భద్రతను కాపాడేందుకు కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్


